చైనా ఉక్కు దిగుమతులపై ఆంక్షలు

20 Oct, 2018 01:18 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఉక్కు పరిశ్రమను ఆదుకోవడంలో భాగంగా పలు రకాల చైనా దిగుమతులపై ప్రభుత్వం యాంటీ డంపింగ్‌ డ్యూటీని విధించింది. టన్ను ఉక్కుపై 185.51 డాలర్లు (రూ.13,622) చొప్పున డ్యూటీని విధిస్తున్నట్లు ప్రకటించిన రెవెన్యూ శాఖ, ఐదేళ్ల వరకు ఈ సుంకం కొనసాగుతుందని పేర్కొంది.

ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు చైనా భారత్‌లో ఉక్కును విక్రయిస్తుందని ఆరోపిస్తూ.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫ్లాగ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్, ఉషా మార్టిన్, గెర్డావ్‌ స్టీల్‌ ఇండియా, వర్ధమాన్‌ స్పెషల్‌ స్టీల్స్, జైస్వాల్‌ నెకో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లు సంయుక్తంగా డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌ (డీజీటీఆర్‌)కు ఇచ్చిన దరఖాస్తును పరిశీలించిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అలాయ్‌ బార్స్, స్ట్రయిట్‌ లెంత్‌ రాడ్స్‌ వంటి పలు ఉత్పత్తులపై టన్నుకు 44.89 నుంచి 185.51 డాలర్ల శ్రేణిలో యాంటీ డంపింగ్‌ డ్యూటీ విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 56,690 టన్నులుగా ఉన్నటువంటి వీటి దిగుమతులు.. 2016–17 నాటికి 1,80,959 టన్నులకు పెరిగాయి. మొత్తం ఉక్కు దిగుమతులు 1,32,933 టన్నుల నుంచి 2,56,004 టన్నులకు పెరిగిపోయాయి. ఇదే సమయంలో డిమాండ్‌ కూడా పెరిగింది.

మరిన్ని వార్తలు