ఖాయిలా సంస్థల మూసివేతకు నియమావళి

10 Sep, 2016 01:17 IST|Sakshi
ఖాయిలా సంస్థల మూసివేతకు నియమావళి

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో ఖాయిలా పరిశ్రమల (సీపీఎస్‌ఈ) మూసివేతకు కేంద్రం మార్గదర్శకాలను జారీచేసింది. చరాస్తులు, భూముల విక్రయం, స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్)ను కోరుకోని ఉద్యోగుల తొలగింపు వంటి అంశాలకు సంబంధించి కాలపరిమితిని ప్రభుత్వ సంస్థల శాఖ (డీపీఈ) జారీ చేసిన నియమావళి నిర్దేశించింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...

74 ఖాయిలా పరిశ్రమలను నీతీ ఆయోగ్ గుర్తించింది. ఇందులో 26 సంస్థల మూసివేతకు సిఫారసులు జరిగాయి.

స్థిర, చర ఆస్తుల విక్రయ బాధ్యతలను భూ నిర్వహణ, వేలం సంస్థలకు అప్పగిస్తారు.

వీఆర్‌ఎస్‌కు అంగీకరించని ఉద్యోగుల తొలగింపు జీరో డేట్ (మూసివేతకు మినిట్స్ జారీ అయిన తేదీ) నుంచి నాలుగు నెలల్లో పూర్తికావల్సి ఉంటుంది.

జీరో డేట్ నుంచి మూడు నెలల్లో వేతన ఇతర చట్టబద్ద బకాయిల అంశాల పరిష్కారం జరగాలి.

ఇదే మూడు నెలల్లో ఆదాయపు పన్ను శాఖకు చేయాల్సిన చెల్లింపులూ జరిగిపోవాలి.

రుణ దాతల బకాయి చెల్లింపులు 2 నెలల్లో పూర్తి కావాలి.

సంబంధిత పరిశ్రమ భూ అమ్మకాలు ఆరు నెలల్లో జరగాలి. ఈ ఆస్తుల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ శాఖలను తొలి ప్రాధాన్యత ఉంటుంది. అటు తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ప్రాధాన్యత ఇస్తారు.

జీరో డేట్ నుంచి ఆరు నెలల్లో కొనుగోళ్లకు ఏ సంస్థ నుంచీ డీపీఏకు ప్రతిపాదన అందకపోతే, నియమనిబంధనలకు లోబడి ఒక వేలం సంస్థకు ఈ బాధ్యతల అప్పగింత జరుగుతుంది.

మరిన్ని వార్తలు