భారీగా పెరిగిన హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లాభం 

10 Nov, 2018 01:42 IST|Sakshi

325 శాతం వృద్ధి 

4 రెట్లు పెరిగిన నిర్వహణ మార్జిన్‌  

ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో భారీగా పెరిగింది. గత క్యూ2లో రూ.68 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 325 శాతం వృద్ధితో రూ.289 కోట్లకు పెరిగిందని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ తెలిపింది. ఆదాయం రూ.2,373 కోట్ల నుంచి 10 శాతం పెరిగి రూ.2,610 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.125 కోట్లుగా ఉన్న ఎబిటా ఈ క్యూ2లో రూ.523 కోట్లకు ఎగసిందని వివరించింది.

నిర్వహణ మార్జిన్‌ 5.3 శాతం నుంచి నాలుగు రెట్లు పెరిగి 20 శాతానికి చేరిందని పేర్కొంది. ముడి పదార్ధాల ధరలు రూ.929 కోట్ల నుంచి 28 శాతం తగ్గి రూ.668 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ షేర్‌ కూడా భారీగా పెరిగింది. బుధవారం రూ.790 వద్ద ముగిసిన ఈ షేర్‌ శుక్రవారం రూ.785–944 కనిష్ట, గరిష్ట స్థాయిల వద్ద కదలాడింది. చివరకు 16 శాతం లాభంతో రూ.919 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు