సులభంగా క్లెయిమ్

31 Aug, 2014 00:19 IST|Sakshi

బీమా కంపెనీ పనితీరును గుర్తించడంలో క్లెయిమ్‌ల పరిష్కారం అనేది చాలా ప్రధానమైనది. అందుకే ఇప్పుడు బీమా కంపెనీలు త్వరితగతిన క్లెయిమ్ పరిష్కారంపై దృష్టి సారిస్తున్నాయి. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి చికాకులు లేకుండా సులభంగా క్లెయిమ్ మొత్తం పొందొచ్చు. క్లెయిమ్ సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను తెలుసుకుందాం...
 
కంపెనీకి తెలియ చేయడం
క్లెయిమ్‌లో అత్యంత కీలకమైన, ముఖ్యమైన అంశం ఏమిటంటే..పాలసీదారుడి మరణానికి సంబంధించిన వార్త బీమా కంపెనీకి తెలియచేయడమే. అప్పటి నుంచే క్లెయిమ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. సాధ్యమైనంత తొందరగా కంపెనీ కార్యాలయంలో కాని లేదా ఈ మెయిల్ ద్వారా కాని వివరాలను చెప్పొచ్చు. పాలసీదారుని పేరు, పాలసీ నంబర్, మరణం సంభవించిన తేదీ, మరణానికి కారణం, క్లెయిమ్ కోరుతున్నవారి వివరాలన్నీ తెలియచేయాలి. ఇవన్నీ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. ఇవి అందితేనే క్లెయిమ్ ప్రక్రియ మొదలవుతుంది.
 
ఇవి జత చేయాలి..
ప్రాథమికంగా క్లెయిమ్ గురించి బీమా కంపెనీకి తెలియచేసిన తర్వాత అధికారికంగా క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కొన్ని కాగితాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. క్లెయిమ్ దరఖాస్తును పూర్తి చేసి దానిని ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్‌తో బీమా కంపెనీకి అందచేయాలి. వీటితో పాటు మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న మరణ ధుృవీకరణ పత్రంతో పాటు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తున్న నామినీ ఫొటోలు, గుర్తింపు కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. జత చేసే జిరాక్స్ కాపీలన్నీ కనీసం ఏదైనా ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టెడ్ చేయించాలి. సాధారణంగా బీమా కంపెనీకి ఈ వివరాలు సరిపోతాయి. కొన్ని సందర్భాల్లో క్లెయిమ్‌ను బట్టి అదనపు సమాచారాన్ని అడుగుతాయి.
 
కాలపరిమితి ఉందా?
క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయడానికి ఎటువంటి కాలపరిమితి లేదు కాని ఆలస్యం కాకుండా ఉండాలంటే ఎంత తొందరగా క్లెయిమ్ చేసుకుంటే అంత తొందరగా పూర్తవుతుంది. కాని క్లెయిమ్‌కు దరఖాస్తు చేసిన తర్వాత గరిష్టంగా 30 రోజుల్లో క్లెయిమ్‌ను పరిష్కరించాలని, ఒకవేళ ఆలస్యం అయితే దానికి గల కారణాలను తెలియచేయాలని ఐఆర్‌డీఏ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు క్లెయిమ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తెలుసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఒక వేళ బీమా కంపెనీ సరైన కారణాలు చూపకుండా క్లెయిమ్ పరిష్కారం చేయడంలో ఆలస్యం చేస్తే ఐఆర్‌డీఏకి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐజీఎంఎస్)ను సంప్రదించవచ్చు. లేదా పాలసీదారుడు వినియోగదారుల ఫోరం, కోర్టు, అంబుడ్స్‌మన్‌లో ఏదో ఒకదాన్ని ఆశ్రయించవచ్చు.

మరిన్ని వార్తలు