కరోనా క్లెయిమ్‌లు సత్వరం సెటిల్‌ చేయండి

5 Mar, 2020 09:33 IST|Sakshi

బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ ఆదేశాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాధి సంబంధిత క్లెయిమ్‌లను తక్షణం పరిష్కరించాలని బీమా సంస్థలను ఐఆర్‌డీఏఐ(ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా) ఆదేశించింది. కరోనా వైరస్‌ చికిత్సకు సంబంధించిన  వ్యయాలు కవరయ్యేలా పాలసీలు రూపొందించాలని బీమా సంస్థలకు సూచించింది. కాగా కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి కనీసం 24 గంటల పాటు హాస్పిటల్‌లో ఉండి చికిత్స తీసుకుంటే  క్లయిమ్‌లు పరిష్కరిస్తామని ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌  హెడ్‌ సుబ్రహ్మణ్యం బ్రహ్మజోస్యుల చెప్పారు.

భారత్‌లో చాలా ఆరోగ్య బీమా పాలసీలు అవుట్‌పేషెంట్‌ ట్రీట్‌మెంట్‌ కవర్‌  చేయవని తెలిపారు. కరోనా వైరస్‌ మహమ్మారి జబ్బు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ, భారత ప్రభుత్వం కానీ ప్రకటిస్తే, కరోనా వైరస్‌ సోకిన వ్యక్తుల క్లెయిమ్‌లు చెల్లవని వివరించారు. కాగా కరోనా సోకిన వ్యక్తి హాస్పిటల్‌లో ఉంటే హాస్పిటలైజేషన్‌ పాలసీల కింద వీరి క్లెయిమ్‌లను సత్వరం సెటిల్‌ చేస్తామని మ్యాక్స్‌ బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎమ్‌డీ, సీఈఓ ఆశీష్‌ మోహరోత్ర చెప్పారు. అయితే కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి క్వారంటైన్‌లో ఉంటే క్లెయిమ్‌ల విషయంలో  ఏ బీమా కంపెనీ కూడా స్పష్టతనివ్వలేదు.

మరిన్ని వార్తలు