బీఎస్‌ఈ బాండ్స్‌ వేదికపై జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సీపీ

19 Dec, 2019 03:53 IST|Sakshi

మరో నాలుగు కంపెనీల కమర్షియల్‌ పేపర్స్‌ కూడా

న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ తన కమర్షియల్‌ పేపర్స్‌ను (సీపీ) బీఎస్‌ఈ బాండ్స్‌ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్‌ చేయాలని బీఎస్‌ఈకి దరఖాస్తు చేసుకుంది. ఈ కంపెనీతో పాటు ఆదిత్య బిర్లా ఫైనాన్స్, కేఈసీ ఇంటర్నేషనల్, ఆదిత్య బిర్లా మనీ, ఫుల్లర్టన్‌ ఇండియా క్రెడిట్‌.. మొత్తం  ఐదు కంపెనీలు సీపీ లిస్టింగ్‌ కోసం దరఖాస్తు చేశాయి. గురువారం ఈ కంపెనీల కమర్షియల్‌ పేపర్స్‌ను లిస్ట్‌ చేస్తామని బీఎస్‌ఈ పేర్కొంది. ఈ కంపెనీలతో కలుపుకుంటే బీఎస్‌ఈ బాండ్స్‌ ప్లాట్‌ఫామ్‌పై కమర్షియల్‌ పేపర్స్‌ను లిస్ట్‌ చేసిన కంపెనీల సంఖ్య 16కు పెరుగుతుంది. ఈ కమర్షియల్‌ పేపర్స్‌ ద్వారా కంపెనీలు రూ.17,835 కోట్లు సమీకరించాయి.

కమర్షియల్‌ పేపర్స్‌ అంటే...  
పెద్ద పెద్ద కంపెనీలు తమ స్వల్పకాలిక రుణాల కోసం ప్రామిసరీ నోట్ల రూపంలో జారీ చేసే మనీ మార్కెట్‌ సాధనంగా కమర్షియల్‌ పేపర్స్‌ను చెప్పుకోవచ్చు. వీటి మెచ్యురిటీ కాలం జారీ చేసిన తేదీ నుంచి కనిష్టంగా ఏడు రోజులు గరిష్టంగా ఏడాది కాలం ఉంటుంది. ముఖ విలువ కంటే కొంచెం డిస్కౌంట్‌కు వీటిని జారీ చేస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్‌ వడ్డీరేట్లు వర్తిస్తాయి.

మరిన్ని వార్తలు