హైదరాబాద్‌లో వన్‌ ప్లస్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌

27 Aug, 2019 05:12 IST|Sakshi
ఆర్‌ అండ్‌ డీ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వికాస్, జయేశ్‌ రంజన్, కేటీఆర్, పీట్‌ లావ్, ఆర్‌అండ్‌డీ సెంటర్‌ హెడ్‌ రామ్‌గోపాల్‌ రెడ్డి (ఎడమ నుంచి వరుసగా)

మూడేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడి

కంపెనీ ఫౌండర్, సీఈవో పీట్‌ లావ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం మొబైల్‌ ఫోన్ల తయారీలో ఉన్న చైనా సంస్థ వన్‌ ప్లస్‌ హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది. ఇక్కడి నానక్‌రామ్‌గూడలో 1,86,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫెసిలిటీని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ సోమవారం ప్రారంభించారు.

అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా వన్‌ ప్లస్‌ ఫౌండర్, సీఈవో పీట్‌ లావ్‌ వెల్లడించారు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ విభాగాల్లో పరిశోధన, అభివృద్ధి సాగుతుందన్నారు. కెమెరా ల్యాబ్, కమ్యూనికేషన్స్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ ల్యాబ్, ఆటోమేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. కెమెరా ల్యాబ్‌కు రూ.100 కోట్లు వ్యయం చేస్తామని వివరించారు. మూడేళ్లలో కంపెనీకి ఇది అతిపెద్ద ఆర్‌అండ్‌డీ కేంద్రంగా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

మూడేళ్లలో 1,500 మంది..
ప్రస్తుతం ఈ కేంద్రంలో 200 మంది నిపుణులు ఉన్నారు. మూడేళ్లలో ఈ సంఖ్య 1,500లకు చేరుతుందని వన్‌ ప్లస్‌ ఇండియా జీఎం వికాస్‌ అగర్వాల్‌ వెల్లడించారు. వీరిలో 25–40 శాతం ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని చెప్పారు. ‘రానున్న మూడేళ్ల కాలంలో ఆర్‌అండ్‌డీ సెంటర్‌కు రూ.1,000 కోట్లు పెట్టుబడి చేస్తాం. ఆవిష్కరణల విషయంలో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలుపుతాం. ఈ ఏడాదే భారత్‌ నుంచి విదేశాలకు మొబైల్‌ ఫోన్లు ఎగుమతి చేస్తాం. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల రంగంలో ప్రపంచంలో 2 శాతం వాటాతో తొలి అయిదు స్థానాల్లో ఉన్నాం. భారత్‌లో 43 శాతం వాటాతో అగ్ర స్థాయిని కైవసం చేసుకున్నాం. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హిమాయత్‌నగర్‌లో నిర్మిస్తున్న అతి పెద్ద ఎక్స్‌పీరియెన్స్‌ జోన్‌ను అక్టోబరు–డిసెంబరు మధ్య ప్రారంభిస్తాం’ అని వివరించారు.

షెంజెన్‌ గుర్తొచ్చింది..
పీట్‌ లావ్‌ గత ఏడాది హైదరాబాద్‌ సందర్శించారు. భాగ్యనగరిని చూడగానే ఆయనకు ప్రపంచ ఎలక్ట్రానిక్స్‌ తయారీ రాజధానిగా పేరున్న షెంజెన్‌ గుర్తొచ్చింది. ఆ నగరం మాదిరిగా హైదరాబాద్‌ సైతం అభివృద్ధి చెందుతోందని పీట్‌ భావించారు. ‘దేశంలో స్టార్టప్స్‌ జోన్‌గా భాగ్యనగరి రూపొందుతోంది. కంపెనీకి అవసరమైన నిపుణులు ఇక్కడ ఉన్నారు. అందుకే ఆర్‌అండ్‌డీ సెంటర్‌ కోసం ఈ నగరాన్ని ఎంచుకున్నాం’ అని ఆయన వెల్లడించారు. తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా పీట్‌ లావ్‌ను ఉద్ధేశించి కేటీఆర్‌ కోరారు. ‘తయారీ కేంద్రానికి అవసరమైన స్థలాన్ని చూపిస్తానని కేటీఆర్‌ చెప్పారు. ఇందుకోసం సెప్టెంబరులో తిరిగి భారత్‌ వస్తాను’ అని పీట్‌ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి నోయిడాలో ఫోన్ల తయారీ ప్లాంటు ఉంది. రెండవ ప్లాంటు ఎక్కడ, ఎప్పుడు స్థాపించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు