నేడు మార్కెట్ల గ్యాపప్‌ ఓపెనింగ్‌!

26 May, 2020 08:50 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 105 పాయింట్లు ప్లస్‌

సోమవారం యూఎస్‌ మార్కెట్లకు సెలవు

యూరోపియన్‌ మార్కెట్లు 2.5 శాతం అప్‌

హుషారుగా కదులుతున్న ఆసియా మార్కెట్లు 

నేడు (మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 105 పాయింట్లు జంప్‌చేసి 9,146 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మే నెల ఫ్యూచర్స్‌ 9,041 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డవున్‌ ఎత్తివేస్తున్న నేపథ్యంలో సోమవారం యూరోపియన్‌ మార్కెట్లు 2.5 శాతం స్థాయిలో పుంజుకోగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం 0.6-1.5 శాతం మధ్య బలపడి ట్రేడవుతున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ సెంటిమెంటు బలపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా మార్కెట్లు హుషారుగా కదిలే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. రంజాన్‌ సందర్భంగా సోమవారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. మెమోరియల్‌ డే సందర్భంగా అమెరికా స్టాక్‌ మార్కెట్లు సైతం పనిచేయలేదు. కాగా.. శుక్రవారం సెన్సెక్స్‌ 260 పాయింట్లు క్షీణించి 30,673 వద్ద నిలవగా..  నిఫ్టీ 67  పాయింట్లు నీరసించి 9,039 వద్ద ముగిసింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 8,955 పాయింట్ల వద్ద, తదుపరి 8,871 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 9,136 పాయింట్ల వద్ద, ఆపై 9,224 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 17,020 పాయింట్ల వద్ద, తదుపరి 16,800 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 17,400 పాయింట్ల వద్ద, తదుపరి 17,660 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1354 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం రూ. 344 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 259 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 402 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు