అనూహ్యంగా మైక్రోసాఫ్ట్‌ సీఐఓ రాజీనామా

8 Jul, 2017 14:17 IST|Sakshi
అనూహ్యంగా మైక్రోసాఫ్ట్‌ సీఐఓ రాజీనామా
శాన్‌ఫ్రాన్సిస్కో : టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో 4000 మంది గ్లోబల్‌ సేల్స్‌ ఉద్యోగులను తీసివేస్తున్నట్టు రిపోర్టులు వస్తున్న క్రమంలో ఆ కంపెనీ చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ జిమ్ డుబోయిస్ కూడా రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. నిన్ననే ఉద్యోగాల కోతను కంపెనీ ధృవీకరించింది. సంస్థ తన భాగస్వాములకు, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి ఈ మార్పులు చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ అధికార ప్రతినిధి చెప్పారు. కానీ సీఐఓ రాజీనామాను ఆయన వెల్లడించలేదు. 1993 నుంచి డుబోయిస్‌ మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. కంపెనీలో వివిధ విభాగాల్లో ఆయన పనిచేశారు. 2013లో ఆయన చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ అయ్యారు. ఆయన ఎక్కువగా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఫోకస్‌ చేసేవారు.
 
డుబోయిస్‌ స్థానంలో సీనియర్‌ మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి కర్ట్‌ డెల్‌బెనె పదవిలోకి వస్తున్నారు. ఉద్యోగాల కోతపై పలు రిపోర్టులు బయటికి వచ్చిన తర్వాత ఈ వార్త వెలుగులోకి రావడం గమనార్హం.  ''ప్రస్తుతం మేం తీసుకుంటున్న చర్యలతో కొందరి ఉపాధి రిస్క్‌లో ఉంటుంది. ఇతర కంపెనీల మాదిరిగానే మేం కూడా ఎప్పటిలాగే వ్యాపార కార్యకలాపాలను పునఃసమీక్షించుకుంటున్నాం. దీనివల్ల కొన్ని విభాగాల్లో పెట్టుబడులు పెరగొచ్చు. అలాగే కొన్ని చోట్ల ఉపాధి తగ్గొచ్చు'' మైక్రోసాఫ్ట్‌ అధికార ప్రతినిధి వివరించారు. అయితే మైక్రోసాఫ్ట్‌లో 3,000 నుంచి 4,000 మధ్యలో ఉద్యోగాల కోత ఉంటుందని న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వార్తలను ఈయన నిర్ధారించలేదు. కాగా మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 1,21,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
  
 
మరిన్ని వార్తలు