ఎన్‌బీఎఫ్‌సీలకు  సెక్యూరిటైజేషన్‌ దన్ను 

16 Apr, 2019 00:24 IST|Sakshi

2018–19లో రూ.26,200 కోట్ల సమీకరణ: ఇక్రా నివేదికలో వెల్లడి  

న్యూఢిల్లీ: నిధుల లభ్యత కష్టంగా మారినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్‌ఐ) రుణాల పోర్ట్‌ఫోలియోను విక్రయించడం ద్వారా (సెక్యూరిటైజేషన్‌) దాదాపు రూ. 26,200 కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ మార్గంలో సమీకరించిన నిధులతో పోలిస్తే ఇది 170 శాతం అధికం. 2017–18లో సెక్యూరిటైజేషన్‌ ద్వారా ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలు రూ. 9,700 కోట్లు సమీకరించాయి. రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) పలు రుణాల చెల్లింపులో డిఫాల్ట్‌ అయిన దరిమిలా గత ఆర్థిక సంవత్సరం ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణాల సంస్థలకు నిధులు లభ్యత కష్టసాధ్యంగా మారిన సంగతి తెలిసిందే.

దీంతో అవి ఫండ్స్‌ సమీకరణ లక్ష్యాల సాధన కోసం ప్రధానంగా సెక్యూరిటైజేషన్‌పై ఆధారపడినట్లు ఇక్రా పేర్కొంది.  ‘2018 ఆర్థిక సంవత్సరంలో, 2019 ప్రథమార్ధంలో మొత్తం నిధుల సమీకరణలో సెక్యూరిటైజేషన్‌ వాటా 18–20 శాతమే ఉంది. కానీ మూడో త్రైమాసికంలో ఇది 37 శాతానికి, నాలుగో త్రైమాసికంలో 50 శాతానికి పెరిగింది‘ అని ఇక్రా గ్రూప్‌ హెడ్‌ (స్ట్రక్చర్డ్‌ ఫైనాన్స్‌ రేటింగ్స్‌ విభాగం) విభోర్‌ మిట్టల్‌ తెలిపారు. 2017–18లో సెక్యూరిటైజేషన్‌ ద్వారా నిధులు సమీకరించిన సంస్థల సంఖ్య 24గా ఉండగా.. 2018–19లో 43కి చేరిందని  ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు