రూపాయికి  తగ్గిన చమురు సెగ 

15 Nov, 2018 00:55 IST|Sakshi

ఒకేరోజు 36 పైసలు లాభం

 72.31 వద్ద ముగింపు   

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం ఒకేరోజు 36 పైసలు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ ఎక్సే్చంజ్‌లో 72.31 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు తాజా గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లు పతనం కావడం... దీనితో దేశంపై దిగుమతుల బిల్లు భారం తగ్గే అవకాశాలు... కరెంట్‌ అకౌంట్‌లోటు (క్యాడ్‌– దేశంలోకి వచ్చీ–వెళ్లే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) అలాగే ధరల పెరుగుదల భయాలు తగ్గడం వంటి అంశాలు రూపాయి లాభానికి కారణాలు.  దీనికితోడు కొన్ని విదేశీ కరెన్సీలపై డాలర్‌ బలహీనత, దేశీయ మార్కెట్‌లో దిగుమతిదారులు, బ్యాంకర్ల అమెరికా కరెన్సీ అమ్మకాల వంటివి కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి.

రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మంగళవారం ముగింపుతో పోల్చితే పటిష్ట స్థాయిలో 72.18 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 71.99కి కూడా రికవరీ అయ్యింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) మార్కెట్‌లో రూ.277 కోట్ల నికర కొనుగోళ్లు జరిపినట్లు తొలి గణాంకాలు వివరించడం మరో అంశం. అక్టోబర్‌ 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.  అయితే అటు తర్వాత ఒడిదుడుకులతో అయినా... కోలుకుంటూ వస్తోంది.  

>
మరిన్ని వార్తలు