ఎయిరిండియా పైలెట్ల సంఘం అల్టిమేటం

25 Dec, 2019 20:07 IST|Sakshi

సహనం నశి​స్తోంది, బకాయిలు చెల్లించండి!

ఎలాంటి నోటీసుల్లేకుండా  నిష్క్రమించడానికి అనుమతివ్వండి- పైలెట్ల సంఘం

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయివేటీకరణకు రంగం సిద్ధమవుతున్న తరుణంలోఎయిరిండియా పైలట్ల యూనియన్ ఘాటుగా స్పందించింది. తమకు రావ్సాలిన బకాయిలపై ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఎలాంటి నోటీసు పీరియడ్‌ (నోటీసు పీరియడ్‌ ఆరు నెలలు) ఇవ్వకుండా తక్షణమే సంస్థనుంచి నిష్క్రమించడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి డిసెంబరు 23న ఒక లేఖ రాశారు.

ఎయిరిండియా అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమైనందున, సంస్థ భవిష్యత్తుపై అనిశ్చితి మధ్య పనిచేసే పరిస్థితిలో తాము లేమని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఎ) హెచ్చరించింది. 2020 మార్చి 31 నాటికి ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించకపోతే ఎయిరిండియా మూసివేయడమే అన్న మంత్రి ప్రకటన ఆందోళన కలిగించే విషయమని లేఖలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకుండా చట్టబద్ధమైన తమ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని ఐసీపీఏ కోరింది. గత రెండు మూడేళ్లుగా అనిశ్చితితో జీవిస్తున్నాం. ఫలితంగా చాలామంది ఉద్యోగులు ఈఎంఐ సహా ఇతర చెల్లింపులను చేయలేకపోయారు. ఇది తమ కుటుంబాలను బాగా ప్రభావితం చేసింది. ఇక తమ సహనం నశించి పోతోందని లేఖలో పేర్కొంది. ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి తమకు రాకూడదని కోరుకుంటున్నామంది.

మరోవైపు ఎయిరిండియా విక్రయంలో భాగంగా డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) డైరెక్టర్‌ (కమర్షియల్‌) డైరెక్టర్ (పర్సనల్‌) ముగ్గురు డైరెక్టర్లను పౌర విమానయాన మంత్రిత్వశాఖ నియమించు కోనుంది. వీరు సంస్థ ఎండీ అశ్వని లోహానీకి రిపోర్టు చేయాల్సి వుంటుంది. మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం జనవరి 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగా దాదాపు 800పైగా పైలట్లు పనిస్తున్న ఎయిరిండియా రుణ భారం రూ. 58,000 కోట్లకు పై మాటే. ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేసిన రెండవ ప్రయత్నం విఫలమైతే విమానయాన సంస్థను మూసివేయవలసి ఉంటుందని హర్దీప్ సింగ్ పూరి నవంబర్‌లో రాజ్యసభకు తెలియజేశారు.

మరిన్ని వార్తలు