పీఈ పెట్టుబడులు పెరిగాయ్!

28 Feb, 2015 03:37 IST|Sakshi
పీఈ పెట్టుబడులు పెరిగాయ్!

సాక్షి, హైదరాబాద్: దేశంలోని స్థిరాస్తి రంగంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు పెరిగాయి. 2013లోని రూ.7,360 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రూ.15,410 కోట్లకు చేరాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2008లో దేశంలోని పీఈ పెట్టుబడులు రూ.17,440 కోట్లు తర్వాత మళ్లీ ఇదే రికార్డు స్థాయి. దేశీయ స్థిరాస్తి రంగంలో మూలధన అవసరాలు పెరగటం, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తున్నందు వల్లే పెట్టుబడులు పెరుగుతున్నాయని నివేదిక చెబుతోంది.

2014 పీఈ పెట్టుబడులలో ఆఫీస్ విభాగం 53 శాతం వాటాను, హౌసింగ్ విభాగం 39 శాతం వాటాను కలిగి ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులలో ఢిల్లీ రూ.5,910 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రూ.4,680 కోట్ల పెట్టుబడులతో ముంబై రెండో స్థానంలో నిలిచింది. నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియల్ విభాగంలో కూడా పెట్టుబడుల్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. పీఈ మొత్తం పెట్టుబడులు ఆఫీస్ విభాగంలో రూ.8,110 కోట్లుగా, హౌసింగ్ విభాగంలో రూ.6,060 కోట్లుగా ఉన్నాయి. రెసిడెన్షియల్ విభాగంలో అవసరాలు, డెవలపర్స్ వద్ద నిధుల కొరత ఉన్న సమయంలో పీఈ పెట్టుబడులు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు