బాబోయ్‌... ధరలు!!

8 Feb, 2018 00:49 IST|Sakshi

ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లు యథాతథం...

రెపో రేటు 6 శాతం, రివర్స్‌ రెపో రేటు 5.75 శాతం

ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు పెరుగుదలపై ఆందోళన

ముంబై: అందరి అంచనాలకు అనుగుణంగానే కీలక రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. రెపో రేటు (బ్యాంకులకు స్వల్ప కాలం కోసం ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే రేటు)ను 6 శాతంగా, రివర్స్‌ రెపో రేటు(బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ తీసుకునే రుణాలపై చెల్లించే రేటు)ను 5.75 శాతంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ అధిక వ్యయాలతో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు పెరిగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

‘‘ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఎన్నో అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాష్ట్రాల్లో ఏడో వేతన కమిషన్‌ సిఫారసుల అమలు, అధిక చమురు ధరలు, కస్టమ్స్‌ డ్యూటీల పెంపు వల్ల ద్రవ్యలోటు 2017–18లో 3.5 శాతానికి చేరొచ్చు. 2018–19 ఆర్థిక సంవత్సర ద్రవ్యలోటు లక్ష్యం ఎక్కువే ఉండొచ్చు. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నట్టు ద్రవ్యలోటు కట్టుతప్పితే ద్రవ్యోల్బణంపై ప్రభావం పడుతుంది. సూక్ష్మ ఆర్థిక రంగంపై విస్తృత స్థాయిలో ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా రుణ సమీకరణ వ్యయాలు పెరిగిపోవడం ఈ పాటికే మొదలైంది. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుంది’’ అని ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ తన అభిప్రాయాలను వెల్లడించింది.

గ్రామీణ ప్రాంతాల్లో అధిక వ్యయాల కోసం రుణాల సమీకరణ, మెగా హెల్త్‌కేర్‌ ప్లాన్‌ను దృష్టిలో ఉంచుకుని 2018–19 బడ్జెట్లో ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయని సందేహం వ్యక్తం చేసింది. ‘‘వాటి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఎంత ఖర్చు చేయనున్నారన్న దానిపై తగినంత సమాచారం ప్రస్తుతానికైతే లేదు. ఈ విషయంలో మరింత సమాచారం కోసం వేచి చూస్తున్నాం’’అని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అన్నారు. కాగా, ఆర్‌బీఐ రేట్ల విషయంలో యథాతథ స్థితినే కొనసాగిస్తుందని, ద్రవ్యోల్బణం విషయంలో కఠిన వ్యాఖ్యలు చేయవచ్చని విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు.

ద్రవ్యోల్బణానికి రెక్కలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి–డిసెంబర్‌)లో ద్రవ్యోల్బణం 5.1% స్థాయిలో ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2018–19) తొలి 6 నెలల్లో ఇది 5.1–5.6%కి పెరుగుతుందని, ఆ తదుపరి ఆరు నెలల కాలంలో 4.5–4.6%కి దిగొస్తుందని అంచనా వేసింది. పెరుగుతున్న చమురు ధరలు, పలు రాష్ట్రాల్లో హెచ్‌ఆర్‌ఏ పెంపు అమలు ద్రవ్యోల్బణాన్ని పెంచే సవాళ్లుగా పేర్కొంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం పెరుగుదలలో హెచ్‌ఆర్‌ఏ పెంపు ప్రభావమే 0.35 శాతంగా ఉంటుందని ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు.  

ఆర్థిక వృద్ధి..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.7%గా ఉంటుందన్న గత అంచనాలను 6.6%కి సవరించింది. ‘‘2018–19లో 7.2%కి పెరుగుతుందని అంచనా. స్థూల అదనపు విలువ (జీవీఏ) 2017–18 సంవత్సరంలో 6.6% ఉండొచ్చు. గతంలో ఈ అంచనా 6.7%. 2018–19లో 7.2% ఉంటుంది. ఆర్థిక రంగం మెరుగుపడే క్రమంలో ఉంది. పెట్టుబడులు పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్న ప్రాథమిక సంకేతాలకు అదనంగా అంతర్జాతీయ డిమాండ్‌ పెరుగుతుండటం దేశీయంగా పెట్టుబడులను బలోపేతం చేస్తుంది’’అని ఆర్‌బీఐ పేర్కొంది.
ద్రవ్యలోటు...: ‘‘ద్రవ్య స్థిరీకరణ ప్రణాళికను ఆలస్యం చేయడం మరిన్ని సవాళ్లకు దారితీస్తుంది. ప్రభుత్వం ద్రవ్యలోటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.2%గా అనుకుంటే అదిప్పుడు 3.5%కి పెరిగిపోయింది. వచ్చే ఏడాదికి ద్రవ్యలోటు గతంలో పేర్కొన్న 3 శాతానికి బదులు 3.2 శాతానికి సవరించడం, మధ్యకాలిక స్థిరీకరణ లక్ష్యాన్ని వాయిదా వేయడం చూస్తుంటే 3 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించడం ఇక 2020–21లోనే సాధ్యం. అంటే షెడ్యూల్‌ కంటే మూడేళ్లు ఆలస్యంగా’’ అని ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు.  

జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి
జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి తగ్గిపోవడంపై అడిగిన ప్రశ్నకు... ఇది పెరిగేందుకు ఎన్నో అవకాశాలున్నాయని ఉర్జిత్‌ పటేల్‌ చెప్పారు. సామర్థ్య వినియోగాన్ని పెంచడం, రుణాల డిమాండ్‌ను రెండంకెల స్థాయికి తీసుకెళ్లడం వంటి చర్యలను పేర్కొన్నారు.

ఇప్పటికింతే...
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ స్థితిలో మరింత డేటా రావాల్సి ఉన్న దృష్ట్యా రెపో రేటును లేదా పరపతి విధానాన్ని మార్చాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం.
– ఉర్జిత్‌ పటేల్, ఆర్‌బీఐ గవర్నర్‌  


కానీ రేట్లను తగ్గించాల్సింది
దేశీ కార్పొరేట్‌ రంగం అభిప్రాయం
ఆర్‌బీఐ నిర్ణయం కార్పొరేట్‌ రంగానికి ఉపశమనమే. ద్రవ్యోల్బణం 5 శాతాన్ని దాటుతుందని, చమురు ధరలపై సెంట్రల్‌ బ్యాంకు వ్యక్తం చేసిన ఆందోళనలు పూర్తి వాస్తవం. దీనికితోడు ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరలను గణనీయంగా పెంచడం కూడా రిటైల్‌ ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. – సందీప్‌ జజోదియా, అసోచామ్‌ ప్రెసిడెంట్‌

ఆర్‌బీఐ గత ఆర్థిక సంవత్సరంలో ఒకే ఒక్కసారి 25 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. 2017–18లో ద్రవ్యోల్బణం గత ఆరు సంవత్సరాల్లోనే సగటున తక్కువగా ఉన్నట్టు ఆర్థిక సర్వే సైతం పేర్కొంది. నిస్సందేహంగా రేట్లను తగ్గించే అవకాశాన్ని జార విడిచారు. రేట్లు తగ్గిస్తే ప్రైవేటు పెట్టుబడులకు ఎంతో ఊతమిచ్చేది.      – రషేష్‌ షా, ఫిక్కి ప్రెసిడెంట్‌  

రుణ గ్రహీతలకు శుభవార్త
బేస్‌ రేటును ఎంసీఎల్‌ఆర్‌తో వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అనుసంధానించనున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. బేస్‌ రేటు విధానంలో పరిమితుల దృష్ట్యా ఆర్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ విధానాన్ని 2016 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎంసీఎల్‌ఆర్‌ విధానం ప్రవేశపెట్టడంతో అప్పటికే బేస్‌ రేటు విధానంలో జారీ అయిన రుణాలను ఎంసీఎల్‌ఆర్‌కు బదలాయింపు జరుగుతుందని ఆశించినట్టు ఆర్‌బీఐ పేర్కొంది.

ఎంఎస్‌ఎంఈ రంగానికి ఊరట
డీమోనిటైజేషన్, జీఎస్‌టీతో చతికిలబడిన సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి (ఎంఎస్‌ఎంఈ) సంస్థలకు ఆర్‌బీఐ కొంత ఊరట కల్పిం చే ప్రయత్నం చేసింది. బ్యాంకులకు తమ బకాయిలను తీర్చేందుకు అదనంగా మరో 6 నెలలు (180 రోజులు) గడువు ఇవ్వనున్నట్టు తెలిపింది. జీఎస్‌టీ ఇక్కట్లను పరిగణనలోకి తీసుకు న్న ఆర్‌బీఐ జీఎస్‌టీ కింద నమోదైన సంస్థలకు రుణాల తిరిగి చెల్లింపుల్లో (రూ.25 కోట్ల వరకు) వెసులుబాటు కల్పించింది.

ఊహించిందే: బ్యాంకర్లు
ఆర్‌బీఐ నిర్ణయం తమ అంచనాలకు అనుగుణంగానే ఉందని బ్యాంకర్లు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్థ భాగంలో తగ్గుముఖం పడితే బాండ్లపై సానుకూల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది.  

ఆర్‌బీఐ యథాతథ స్థితి ఊహించిందే. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి వస్తుందన్న అంచనాలు బాండ్ల మార్కెట్‌కు సానుకూలం.     – రజనీష్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌
పెట్టుబడులు, ఎగుమతుల్లో వృద్ధి, భారీ రుణ గ్రహీతలకు అసెట్‌ రిజల్యూషన్, రుణాల వృద్ధి తదితర అంశాలు వృద్ధికి దోహదపడతాయని సెంట్రల్‌ బ్యాంకు పేర్కొనడం స్వాగతించదగినది.     
– చందాకొచర్, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో

మరిన్ని వార్తలు