జియోకు ఊరట: ఉచిత ఆఫర్లకు నో ఢోకా

21 Jul, 2017 18:28 IST|Sakshi
జియోకు ఊరట: ఉచిత ఆఫర్లకు నో ఢోకా
టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌, రిలయన్స్‌ జియోకు పెద్ద ఊరటనిచ్చింది. ఎన్నిరోజులైనా జియో ఉచిత ఆఫర్లలో మార్కెట్‌లో సంచలనాలు సృష్టించవచ్చు. ఎందుకంటే టెలికాం దిగ్గజాలు ఎప్పటి నుంచో కోరుతున్న 'మినిమమ్‌ ఫ్లోర్‌ ప్రైస్‌'పై ట్రాయ్‌ శుక్రవారం తేల్చేసింది. టెలికాం సర్వీసులకు ఇప్పుడేమీ ఫ్లోర్‌ ప్రైస్‌ను అవసరం లేదని ట్రాయ్‌ చెప్పింది. దీంతో టెలికాం దిగ్గజాలకు మరో షాక్‌ ఎదురైనట్టైంది. మినిమమ్‌ ఫ్లోర్‌ ధరలతో జియో ఉచిత ఆఫర్లకు చెక్‌ పెట్టాలని ఈ కంపెనీలు భావించాయి.
 
ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ, శుక్రవారం అన్ని టెలికాం ప్రొవైడర్ల ప్రతినిధులతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. ఫ్లోర్‌ ప్రైస్‌ నిర్ణయించాలనేది సరియైన ఆలోచన కాదని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఈ ధరలేమీ అవసరం లేదన్నారు. ఇక దీనిపై మరోసారి చర్చించేది లేదని కూడా చెప్పేశారు. డేటా ,వాయిస్ కాల్స్ రెండింటికీ కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించాలని కోరుతూ కొన్ని టెలికాం ఆపరేటర్లు ట్రాయ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
 
ఒకవేళ మినిమమ్‌ ఫ్లోర్‌ ధరను నిర్ణయిస్తే, మార్కెట్‌లో ఉచిత ఆఫర్లకు కళ్లెం పడుతోంది. ప్రస్తుతం రిలయన్స్‌ జియో ఉచిత ఆఫర్లలో టెలికాం కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ట్రాయ్‌ చైర్మన్‌ నిర్వహించిన సమావేశంలో మినిమమ్‌ ఫ్లోర్‌ ప్రైస్‌ నిర్ణయించాలనే దానిపై ఐడియా దాదాపు గంటపాటు ప్రజెంటేషన్‌ ఇచ్చింది. అయినప్పటికీ ట్రాయ్‌ ఈ విషయంపై సముఖత వ్యక్తంచేయలేదు. ఇప్పట్లో ఈ ధరలు అవసరం లేదనే పేర్కొంది.  
 
మరిన్ని వార్తలు