'బీజేపీని దేశంలో లేకుండా చేస్తా.. చాలెంజ్‌' | Sakshi
Sakshi News home page

'బీజేపీని దేశంలో లేకుండా చేస్తా.. చాలెంజ్‌'

Published Fri, Jul 21 2017 6:41 PM

'బీజేపీని దేశంలో లేకుండా చేస్తా.. చాలెంజ్‌' - Sakshi

కోల్‌కతా: బీజేపీని దేశం నుంచి వెళ్లగొట్టండి అంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి విరుచుపడ్డారు. చేసిన అన్ని హామీల్లో, అన్ని విభాగాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని మమత స్పష్టం చేశారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 30 వరకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైన బీజేపీని దేశం నుంచి వెళ్లగొట్టాలనే నినాదంతో తాము పెద్ద మొత్తంలో కార్యక్రమాలు చేయనున్నట్లు మమత బెనర్జీ చెప్పారు. విదేశాలతో సంబంధాల విషయంలో ముఖ్యంగా పొరుగున ఉండే దేశాలతో మంచి సంబంధాలు నెరిపే విషయంలో విఫలమైందని మండిపడ్డారు.

'భారత్‌ నుంచి బీజేపీని బహిష్కరిస్తాం. ఇది మా సవాల్‌' అని ఆమె ప్రతినబూనారు. శారదా, నారదా కుంభకోణం పేరుతో తమను బెదిరించాలని కేంద్రం చూస్తోందని, అయినా తాము బెదిరేది లేదని, తమలో ఏ ఒక్కరం కూడా తప్పు చేయలేదని అన్నారు. ఎవరి ముందు తమ తలలు వంచబోమని ఆమె తెలిపారు. సీబీఐతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలపై తాము పరువు నష్టం దావా వేయనున్నట్లు మమత తెలిపారు. ఏ తప్పు చేయకపోయినా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల పరువు తీస్తున్నారని మండిపడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం(జూలై 21)న అమరుల దినోత్సవ ర్యాలీ నిర్వహించింది. 1993లో పోలీసులు జరిపిన కాల్పుల్లో యూత్‌ కాంగ్రెస్‌కు చెందిన 13మంది చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ అమరుల దినోత్సవం నిర్వహిస్తుంటారు.

Advertisement
Advertisement