బ్యాంకుల్లోకి రూ.2 లక్షల కోట్ల ‘ఫండ్స్‌’

27 Oct, 2018 01:39 IST|Sakshi

ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల మద్దతు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆర్థిక వేత్తల అంచనా  

ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ సంక్షోభం తర్వాత ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల నుంచి రూ.2 లక్షల కోట్ల మేర ఉపసంహరించుకోగా... ఇవి బ్యాంకుల్లోకి చేరాయి. ఈ నిధులు ఇతర బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) మద్దతుగా నిలుస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఈ విషయాన్ని ఒక నివేదికలో తెలియజేశారు. ‘‘ఇన్వెస్టర్లు లిక్విడ్‌ ఫండ్స్, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి ఈ స్థాయిలో నిధులను వెనక్కి తీసుకున్నారు.

ఈ స్థాయిలో భారీగా వచ్చిన డిపాజిట్లను బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి నాణ్యమైన ఆస్తుల కొనుగోలుకు వినియోగించే అవకాశముంది. ఎక్కువ శాతం ఇదే జరగొచ్చు కూడా. దీంతో లిక్విడిటీకి సంబంధించిన ఆందోళనలు సమసిపోతాయి’’ అని ఈ నివేదిక పేర్కొంది. బ్యాంకులు ఇప్పటికే ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఆస్తులు కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరించిన విషయాన్ని గుర్తు చేసింది.

ఎస్‌బీఐ అయితే, లిక్విడిటీ సమస్యకు పరిష్కారంగా మూడు రెట్లు అధికంగా రూ.45,000 కోట్ల వరకు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఆస్తు ల కొనుగోలుకు సిద్ధమని ప్రకటించింది. లిక్విడిటీకి కొరత ఏర్పడితే మాత్రం కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ రుణాలు, చిన్న వ్యాపారులు, హౌసింగ్‌ రుణాలపై ప్రభావం ఉంటుందని, ఈ వర్గాలకిచ్చే రుణాలు తగ్గిపోతాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నివేదిక పేర్కొంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ అంశంపై విధాన నిర్ణేతలు స్పందించడంతో, అది వ్యవస్థాగత సమస్యగా మారకపోవచ్చని కూడా ఈ నివేదిక అభిప్రాయపడింది.


సానుకూల బ్యాంకింగ్‌ రుణ వృద్ధి
ముంబై: బ్యాంకింగ్‌ రుణ వృద్ధి  2018 అక్టోబర్‌ 12వ తేదీతో ముగిసిన పక్షం రోజుల కాలానికి గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, 14.35 శాతం పెరిగింది. రూ.89.93 లక్షల కోట్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకింగ్‌ రుణాలు రూ.78.65 లక్షల కోట్లు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం–  
తాజా సమీక్షా కాలంలో డిపాజిట్ల వృద్ధి రేటు 8.86 శాతం పెరిగింది. విలువ రూపంలో 108.25 లక్షల కోట్ల నుంచి రూ.117.85 లక్షల కోట్లకు చేరింది.  
   సెప్టెంబర్‌ 28వ తేదీతో ముగిసిన పక్షం రోజులనుచూస్తే, (2017 ఇదే కాలంతో పోల్చి) రుణ వృద్ధి 12.51 శాతం పెరిగి, రూ.89.82 లక్షల కోట్లకు చేరింది. కాగా డిపాజిట్లలో రేటు 8.07 శాతం పెరుగుదలతో రూ.117.99 లక్షల కోట్లుగా నమోదయ్యింది.  
  మరోవైపు 2018 ఆగస్టులో ఆహార విభాగానికి రుణంలో 12.4 శాతం వృద్ధి నమోదయ్యింది.   
 ఇదే నెలలో పారిశ్రామిక రంగానికి రుణాల్లో వృద్ధి 0.3 శాతం నుంచి 1.9 శాతానికి చేరింది. 

>
మరిన్ని వార్తలు