మొట్టమొదటిసారి భారీగా కుప్పకూలిన రూపాయి

28 Jun, 2018 09:47 IST|Sakshi
మొట్టమొదటిసారి 69 స్థాయికి పడిపోయిన రూపాయి

ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. మొట్టమొదటిసారి డాలర్‌కు మారకంలో 69 మార్కును చేధించిన రూపాయి ఆల్‌-టైమ్‌ కనిష్ట స్థాయిలకు పడిపోయింది. బుధవారం ట్రేడింగ్‌ ముగింపులోనే భారీగా పతనమైన రూపాయి, నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలో మరింత క్షీణించింది. ప్రస్తుతం 79 పైసల మేర క్షీణించి 69.04గా ట్రేడవుతోంది. బుధవారం కూడా 37 పైసల మేర పడిపోయి 19 నెలల కనిష్టంలో 68.61 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతాయని సంకేతాలు, ఈ రేట్ల పెరుగుదలతో కరెంటు ఖాతా లోటు మరింత పెరుగుతుందని, ద్రవ్యోల్బణమూ ఎగుస్తుందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొనడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.  

అటు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు సైతం కరెన్సీ ట్రేడర్స్‌ను కలవరపరుస్తున్నాయి. ఇక ఎమర్జింగ్‌ మార్కెట్‌ కరెన్సీలు కూడా బలహీనంగా ట్రేడవుతుండటం రూపాయిని మరింత దిగజారుస్తోంది. రూపాయి విలువ 68.80-68.85 స్థాయిల వద్ద ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాల్సి ఉందని, కానీ 68.86 మార్కు కంటే భారీగా రూపాయి పతనమైందని.. ఇక వచ్చే సెషన్లలో కచ్చితంగా రూపాయి భారీగా క్షీణిస్తుందని ఆనంద్‌ రతి కమోడిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రుషబ్‌ మారు అన్నారు. వెంటనే 70 నుంచి 70.50 స్థాయిలకు పడిపోయే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్‌ వాణిజ్య లోటు దేశమని, ఎమర్జింగ్‌ మార్కెట్లలో క్యాపిటల్‌ ఫ్లోస్‌ తగ్గితే, రూపాయి విలువ క్షీణించడం సాధారణమని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా గ్లోబల్‌ మార్కెట్స్‌, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ అధినేత, ఎండీ మనీష్‌ వాద్వాన్‌ తెలిపారు. మరోవైపు ఆయిల్‌ ధరలు కూడా పైపైకి ఎగుస్తున్నాయన్నారు. 
 

మరిన్ని వార్తలు