రూపాయి విలువ... 2 వారాల కనిష్టానికి

16 Sep, 2016 00:40 IST|Sakshi
రూపాయి విలువ... 2 వారాల కనిష్టానికి

13 పైసలు డౌన్
డీవేల్యుయేషన్ వార్తల ప్రభావం

 ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ 67 దిగువకు పడిపోయింది. డాలర్‌కు డిమాండ్ పెరగడం, రూపాయి విలువను తగ్గించాలంటూ(డీవేల్యుయేషన్) వాణిజ్య శాఖ ప్రతిపాదించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో దేశీ కరెన్సీ గురువారం 13 పైసలు దిగజారి 67.02 వద్ద స్థిరపడింది. ఆగస్టు 30 తర్వాత మళ్లీ రూపాయి ఈ స్థాయికి క్షీణించడం(రెండు వారాల కనిష్టానికి) గమనార్హం.

పడిపోతున్న ఎగుమతులను ప్రోత్సహించడం కోసం రూపాయి డీవేల్యూయేషన్ వ్యూహంపై ఆర్థిక మంత్రిత్వ శాఖతో వాణిజ్య శాఖ సంప్రదింపులు జరుపుతోందన్న వార్తలు రావడంతో గురువారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి విలువ ఒకానొక దశలో 67.07 స్థాయికి కూడా పడింది.

కాగా, బలహీన ఆర్థిక, ఉద్యోగ గణాంకాలు వెలువడినప్పటికీ.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రానున్న పాలసీ సమీక్షలో వడ్డీరేట్లను పెంచొచ్చన్న అంచనాలు పెరగడంతో ప్రపంచంలోని ఇతర ప్రధాన కరెన్సీలతో డాలర్ మారకం విలువ బలపడటం కూడా రూపాయి క్షీణతకు కారణంగా నిలిచిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

డీవేల్యూ ప్రణాళికల్లేవు: ఆర్థిక శాఖ
దేశీ కరెన్సీ విలువను తగ్గించే ప్రణాళికలేవీ లేవని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మార్కెట్ నిర్దేశితంగానే రూపాయి విలువ కొనసాగుతుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరణ ఇచ్చారు. ‘డీవేల్యూ ప్రతిపాదనేదీ లేదు. ఎగుమతిదారులు వాణిజ్య శాఖను ఈ విషయంపై సంప్రదించి ఉండొచ్చు.

అయితే, దీనిపై మేం ఎలాంటి చర్చలూ జరపలేదు’ అని ఆయన పేర్కొన్నారు. మరోపక్క, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆర్థిక శాఖతో తాము దీనిపై ఎలాంటి చర్చలూ జరపలేదని, ఈ విధంగా వచ్చిన వార్తలన్నీ నిరాధారమంటూ ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ కూడా రూపాయి విలువను ప్రభుత్వం నిర్దేశించబోదని.. ప్రస్తుతం ఉన్న మార్కెట్ నిర్ధారిత పాలసీయే కొనసాగుతుందని తేల్చిచెప్పారు. మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు.

మరిన్ని వార్తలు