పండుగ సీజన్‌పైనే ఆశలు..

27 Jun, 2020 05:28 IST|Sakshi
కియా మోటార్స్‌ సేల్స్, మార్కెటింగ్‌ విభాగం హెడ్‌ మనోహర్‌ భట్‌

కియా మోటార్స్‌ సేల్స్‌ హెడ్‌ మనోహర్‌ భట్‌

అప్పటికి మార్కెట్‌ పుంజుకోగలదు

క్యూ3లో సోనెట్‌ కారు అందుబాటులోకి

లాక్‌డౌన్‌లోనూ 3,500 బుకింగ్స్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా వైరస్‌ పరిణామాలతో దెబ్బతిన్న వాహనాల మార్కెట్‌ పండుగ సీజన్‌ నాటికి పుంజుకోగలదని కియా మోటార్స్‌ సేల్స్, మార్కెటింగ్‌ విభాగం హెడ్‌ మనోహర్‌ భట్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటికి మూడో కారు సోనెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.  లాక్‌డౌన్‌ సమయంలోనూ 3,500 పైచిలుకు బుకింగ్స్‌ వచ్చాయని తెలిపారాయన. అనంతపురంలోని తయారీ ప్లాంటును మరింతగా విస్తరించేందుకు ఇటీవలే 54 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..

వాహన విక్రయాలపై కరోనాపరమైన ప్రభావాలు ఎలా ఉన్నాయి?  
పరిశ్రమపై కరోనాపరమైన ప్రతికూల ప్రభావ తీవ్రతను గణాంకాలపరంగా ఇంతని ప్రస్తుతం చెప్పలేము. ఏప్రిల్‌లో అమ్మకాలు సున్నాకి పడిపోవడమనేది ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో పరిశ్రమ చిక్కుకున్నది తెలియజేస్తోంది. అయితే, మరికొద్ది నెలల్లోనే మార్కెట్‌ తిరిగి పుంజుకోగలదని ఆశావహంగా ఉన్నాం. సరఫరాలు, మార్కెట్‌ స్థిరపడటానికి కాస్త సమయం పడుతుంది. మా ఉత్పత్తులన్నీ మేడ్‌–ఇన్‌–ఇండియానే కావడం, స్థానికంగానే మెజారిటీ విడిభాగాలను కొనుగోలు చేస్తుండటం వల్ల మాపై ప్రతికూల ప్రభావం కాస్త తక్కువే. మేం మరింత వేగంగా పుంజుకోగలమని ధీమా ఉంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలెంత స్థాయిలో ఉంటాయనేది ఇప్పుడే ముందస్తుగా ఏమీ చెప్పలేము.

ఇకపై అమ్మకాల ధోరణి ఎలా ఉండవచ్చు?
అంతర్జాతీయంగా ధోరణులు చూస్తుంటే ప్రయాణాల కోసం ఇకపై ప్రజా రవాణా సాధనాల కంటే వ్యక్తిగత వాహనాలకే ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కచ్చితంగా కార్ల అమ్మకాలను పెంచుతుంది. కరోనా నియంత్రణలోకి వచ్చాక మార్కెట్‌ వేగం పుంజుకోవచ్చు. అయితే, దేశీయంగా ఇంకా పరిస్థితులు స్థిరపడాల్సి ఉంది. కాబట్టి విక్రయాలు ఎగిసేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. పండుగ సీజన్‌ .. అంటే ఈ ఏడాది మూడో క్వార్టర్‌లో అమ్మకాలు పుంజుకోవచ్చని ఆశిస్తున్నాం.  

ప్రస్తుతం కంపెనీ ఆర్డరు బుక్‌ ఎలా ఉంది?
లాక్‌డౌన్‌లో కూడా 3,500 పైచిలుకు బుకింగ్స్‌ వచ్చాయి. బుకింగ్స్‌ రద్దయిన సంఖ్య చాలా తక్కువే. ప్రస్తుతం సెల్టోస్, కార్నివాల్‌కు సంబంధించి బుక్‌ అయిన 25,000 పైగా వాహనాలు డెలివరీ కావాల్సి ఉంది. దశలవారీగా మా టచ్‌ పాయింట్స్‌లో 94 శాతం పాయింట్స్‌ను ప్రారంభించాం. మే నెలలో 1,600 యూనిట్లు విక్రయించాం. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ధోరణుల విషయానికొస్తే.. వాహనాల కొనుగోళ్లను కస్టమర్లు ఆన్‌లైన్‌లోనే జరిపేలా చూడటం ఆటోమొబైల్‌ సంస్థలకు కాస్త సవాలుతో కూడుకున్నదే. ఎందుకంటే.. మిగతా ఉత్పత్తులతో పోలిస్తే కారు కొనుగోలు చాలా భిన్నమైనది.

డిజిటల్‌గా కాకుండా కారును భౌతికంగా చూసి, నడిపి, సంతృప్తి చెందిన తర్వాతే నిర్ణయం తీసుకోవడానికి కస్టమర్లు ఇష్టపడతారు. అయితే, డిజిటల్‌ షోరూమ్‌లు భవిష్యత్‌లో అమ్మకాలు పెంచుకోవడానికి కచ్చితంగా ఉపయోగపడగలవు. ఈ నేపథ్యంలో ఇటు డిజిటల్, అటు ఫిజికల్‌ షోరూమ్‌ల మేళవింపుతో కంపెనీలు ముందుకెళ్లాల్సి ఉంటుంది. మా విషయానికొస్తే.. మేం ముందునుంచే అమ్మకాల ప్రక్రియను డిజిటైజ్‌ చేసేందుకు గణనీయంగా ఇన్వెస్ట్‌ చేశాం. ప్రస్తుతం కొనుగోలు నుంచి హోమ్‌ డెలివరీ దాకా సేవలు అందిస్తున్నాం. మా మొత్తం వాహన విక్రయాల్లో 7–8 శాతం ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారానే ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నాం.  

మరిన్ని కొత్త మోడల్స్‌ ప్రవేశపెట్టబోతున్నారా?
మా మూడో ఉత్పత్తయిన కియా సోనెట్‌ (కంపాక్ట్‌ ఎస్‌యూవీ)ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. పండుగ సీజన్‌లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2020 ఆటో ఎక్స్‌పోలో అంతర్జాతీయంగా సోనెట్‌ను ప్రదర్శించినప్పుడు మంచి స్పందన వచ్చింది.  

కరోనా పరిణామాలతో వ్యయ నియంత్రణ చర్యలేమైనా తీసుకున్నారా?
ముందునుంచే మా భాగస్వాములు, ఉద్యోగులు, డీలర్లు, సరఫరాదారులు అంతా కలిసికట్టుగానే ఉన్నాం. ఈ కష్టకాలంలో కూడా అదే ధోరణి కొనసాగింది. కాబట్టి పెద్దగా వ్యయ నియంత్రణ చర్యలేమీ తీసుకోలేదు.  

కొత్త నియామకాల ప్రణాళికలేమైనా ఉన్నాయా?
మా వెండార్‌ పార్ట్‌నర్లతో కలిపి కియా మోటార్స్‌ ఇండియా సిబ్బంది సంఖ్య మొత్తం 13,000 పైచిలుకు ఉంటుంది. మా సిబ్బందిలో చాలా మంది సమీప ప్రాంతాలు, రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. ప్రస్తుతానికి తగినంత స్థాయిలో సిబ్బంది ఉన్నారు. అనంతపురంలోని ప్లాంటును మరింత విస్తరించేందుకు, ఉత్పత్తి పెంచేందుకు ఇటీవలే 54 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. ఈ ప్రాంతంలో ఉపాధి కల్పనకు కూడా దీనితో ఊతం లభించగలదు.  

కస్టమర్లను ఆకర్షించేందుకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారు?
దేశంలోనే తొలిసారిగా కార్లకు ఉచితంగా శానిటైజేషన్‌ కార్యక్రమాన్ని ఇటీవలే కియా కేర్‌ ప్రచార కార్యక్రమం కింద ప్రకటించాం. ముందుగా సంప్రతించినవారికి ఈ సర్వీసులు అందిస్తున్నాం. ఇక కియా కేర్‌ కింద వాహనాలకే కాకుండా, సర్వీస్‌ సెంటర్లు, డీలర్‌షిప్‌లలో కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్‌ నియంత్రణకు సంబంధించి తగు భద్రతా చర్యలు అమలు చేస్తున్నాం. ఇక కస్టమర్లకు కియా లింక్‌ యాప్‌ ద్వారా వాహనాల పికప్, డ్రాప్, మొబైల్‌ వర్క్‌షాప్‌ల వంటి సేవలు అందిస్తున్నాం. 

మరిన్ని వార్తలు