సెల్‌తో హెల్‌ | Sakshi
Sakshi News home page

సెల్‌తో హెల్‌

Published Fri, Mar 30 2018 1:18 PM

Smart Phone Froblems In Anganwadi Centres - Sakshi

అంగన్‌వాడీలకు సరఫరా చేసిన మొబైల్‌ఫోన్ల ధర విషయంలో ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. రూ.5 వేలు పలికే సెల్‌ఫోన్‌ను రూ.6,990కు కొనుగోలు చేసినట్టు అంగన్‌వాడీలతో బాండ్లు రాయించుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ జరిగిందంటున్నారు. దీనికి తోడు ఇప్పుడా ఫోన్లు సక్రమంగా పనిచేయక తరచూ పాడవుతున్నాయి. దాదాపు రూ.2 వేలు అదనంగా వెచ్చించి కొన్న ఫోన్లతో అవస్థలు పడుతున్నామని అంగన్‌వాడీలు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయిలో టోకుగా  కొన్న సెల్‌ఫోన్ల ద్వారా ప్రభుత్వ పెద్దలకు ఎంత లబ్ధి చేకూరిందో తెలియదు గాని తమకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయని నిట్టూరుస్తున్నారు.

 సాక్షి ప్రతినిధి, కాకినాడ:అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును సాంకేతికపరంగా పరిశీలించేందుకు ప్రభుత్వం జిల్లాలో 5,546 కేంద్రాల కార్యకర్తలకు మూడు నెలల క్రితం మొబైల్‌ఫోన్లను అందజేసింది. కేంద్రాల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్నీ అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఇంతవరకు బాగానే ఉన్నా అంగన్‌వాడీలకు అందజేసిన సెల్‌ ఫోన్లు మాత్రం సక్రమంగా çపనిచేయడం లేదు. తరుచూ పాడై ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సెల్‌ఫోన్ల ధర విషయంలో పెద్ద ఎత్తున సొమ్ము దుర్వినియోగమైనట్టు ఆరోపణలు ఉన్నాయి. ఓ కంపెనీ మొబైల్‌ ఫోన్లు ఆన్‌లైన్‌లో అత్యధికంగా రూ. 5,390, అత్యల్పంగా రూ. 4,970కు లభిస్తుండగా ప్రభుత్వం అందజేసిన ఫోన్ల ధరను రూ.6,990 పేర్కొంటూ అంగన్‌వాడీలతో బాండ్లపై సంతకాలు చేయించుకున్నారు. జిల్లాలోని 5,546 మంది కార్యకర్తలకు రూ.3,87,66,540తో సెల్‌ఫోన్లు కొనుగోలు ప్రభుత్వ స్థాయిలోనే జరిగింది. పాలకులకు కావల్సిన వ్యక్తికి బల్క్‌గా కాంట్రాక్ట్‌కు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ కాంట్రాక్టర్‌ తనకు నచ్చిన ధర వేసుకుని ప్రభుత్వానికి అంటగట్టగా, వాటిని అంగన్‌వాడీ కార్యకర్తలకు అందజేశారు. ఇవి పాడైతే బాధ్యులవుతారని అంగన్‌వాడీల చేత పూచీకత్తు కూడా రాయించుకున్నారు.

వాస్తవానికి, అంగన్‌వాడీలకు సరఫరా చేసిన సెల్‌ఫోన్ల ధర రూ. 5 వేలకు మించి ఉండదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక బల్క్‌లో తీసుకుంటే అంతకన్నా తక్కువ ధరకు వస్తాయి. కానీ, అంగన్‌వాడీలకు సరఫరా చేసిన సెల్‌ఫోన్లు తక్కువ ధరకు చూపించలేదు సరికదా ఒక్కొక్కదానిపై రూ. 2 వేల వరకు అదనంగా చూపించారు. ఈ సెల్‌ఫోన్ల కాంట్రాక్ట్‌లో పాలక పెద్దలకు ఎంత ముట్టిందో తెలియదు గానీ.. కోట్లు వెచ్చించి సరఫరా చేసిన సెల్‌ఫోన్లు మాత్రం  కేంద్రాల సమాచారాన్ని పంపించే సమయంలో మొరాయిస్తూ కార్యకర్తలను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. సెల్‌ఫోన్లకు అమర్చిన నెట్‌ కూడా సరిగా పనిచేయకపోవడంతో డేటా ఎంట్రీ చేయాలంటే యాతన పడుతున్నారు. తరచూ మొరాయిస్తున్న సెల్‌ఫోన్లను మరమ్మతులు  చేయించుకోవలసి వస్తోందని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్‌ కూడా పగలు సరిగా పనిచేయకపోవడంతో అర్ధరాత్రి సమయంలో మేల్కొని సమాచారాన్ని పంపించాల్సి వస్తోందని వాపోతున్నారు.

పనిభారం రెట్టింపైంది..
సెల్‌ ఫోన్‌లో వర్కులు చేయకపోతే జీతాలు రావని, ఇచ్చిన పేర్ల వివరాలను తక్షణం చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలను అధికారులు వేధిస్తున్నారు. సెల్‌లో వర్కు చేస్తే రికార్డులు రాయనవసరం లేదని మొదట్లో చెప్పారు. నిజమే కదా అని నమ్మితే ఇప్పుడు అటు సెల్‌ వర్కూ, ఇటు రికార్డు వర్కూ చేయాల్సి వస్తుంది. సెల్‌లో ఒక పేరు నమోదు చేయాలంటే  40 నిమిషాల నుంచి ఒక గంట పడుతోంది. పగలు సర్వర్‌ పని చేయకపోవడం, రాత్రి 11 గంటల నుంచి పని చేస్తుందని కొంతసేపు, రాత్రి 2 గంటలు దాటాక పని చేస్తుందని మరి కొంత సేపు రావడంతో అధికారులకు బయపడి అర్ధరాత్రి సమయంలో మేల్కొని, సెల్‌ వర్కులు చేస్తున్నారు. నాసిరకం ఫోన్లు ఇవ్వడమే కాక.. చెడిపోతే మా నుంచే సొమ్ములు వసూలు చేస్తామని అధికారులు బెదిరించి మరీ లెటర్లు తీసుకున్నారు. జీతాలు తక్కువ ఇస్తూ, బాధ్యతలు పెంచేసి అనారోగ్యాల పాలు చేస్తున్నారు.–  ఎం.వీరలక్ష్మి, అంగన్‌వాడీ వర్కర్స్,హెల్పర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు, కాకినాడ

Advertisement
Advertisement