కొనుగోళ్లతో కళకళలాడిన మార్కెట్లు

25 May, 2018 16:21 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్లు (ఫైల్‌ ఫోటో)

ముంబై : రూపాయి బలపడటం, ఆయిల్‌ ధరలు కరెక్షన్‌కు గురవడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు రెండో రోజు కళకళలాడాయి. నిన్ననే జిల్‌జిగేల్‌మనిపించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, నేడు కూడా కొనుగోళ్ల జోరుతో దూసుకెళ్లాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌, ఆయిల్‌, మెటల్స్‌, టెక్నాలజీ స్టాక్స్‌ మద్దతుతో సెన్సెక్స్‌ 262 పాయింట్లు లాభపడి 34,924.87 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 91 పాయింట్ల లాభంలో 10,605 వద్ద క్లోజైంది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2 శాతం వరకు ర్యాలీ నిర్వహించింది. నేటి మార్కెట్‌లో అన్ని రంగాల షేర్లు గ్రీన్‌గానే ట్రేడయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు లాభాల బాట కొనసాగించాయి.  

నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, ఐబీ హౌసింగ్‌, హిందాల్కో, హెచ్‌పీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌, ఓఎన్‌జీసీ, గెయిల్‌, టాటా స్టీల్‌, యస్‌బ్యాంక్‌, బీపీసీఎల్‌లు 5.4-2.7 శాతం లాభపడగా.. ఇన్‌ఫ్రాటెల్‌, టెక్ మహీంద్రా, కోల్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ 1-0.5 శాతం మధ్య నష్టాలు గడించాయి. గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరుగుతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలు కిందకి పడిపోయాయి. రష్యా నుంచి ఆయిల్‌ సప్లై పెరుగుతుందనే సంకేతాలతో బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 3 శాతం పడిపోయి బ్యారల్‌కు 78 డాలర్లుగా నమోదైంది. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ బ్యారల్‌కు 80.50 డాలర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు రూపాయి విలువ కూడా వరుసగా రెండో రోజు బలపడింది. 18 నెలల కనిష్టస్థాయిల నుంచి 55 పైసల వరకు లాభపడి రూ.67.79గా నమోదైంది. 

మరిన్ని వార్తలు