స్టాక్స్‌ వ్యూ

25 Feb, 2019 00:56 IST|Sakshi

నాల్కో

ప్రస్తుత ధర:  రూ.49       
టార్గెట్‌ ధర: రూ.69 
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ 

ఎందుకంటే: నాల్కో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కొన్ని అంశాల్లో అంచనాలను మించాయి. అయితే ఉత్పత్తి వ్యయాలు పెరగడం కొంత నిరాశపరిచింది. ఈ క్యూ3లో రూ.620 కోట్ల ఎబిటా రాగలదని అంచనా వేశాం. కానీ ఈ కంపెనీ రూ.510 కోట్ల ఎబిటానే సాధించింది. వార్షికంగా చూస్తే, ఎబిటా 10% పెరిగినా, సీక్వెన్షియల్‌గా చూస్తే, 40% క్షీణించింది. అమ్మకాలు, రియలైజేషన్లు తక్కువగా ఉండటం, ఉత్పత్తి వ్యయాలు అధికంగా ఉండటం దీనికి ప్రధాన కారణాలు. నికర లాభం 9% ఎగసి రూ.300 కోట్లకు పెరిగింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, 41% క్షీణత నమోదైంది. ఈ క్యూ2తో పోల్చితే ఈ క్యూ3లో అల్యుమినా ఉత్పత్తి 12% పెరిగినా, అమ్మకాలు మాత్రం 10% తగ్గాయి. అల్యూమినియం ఉత్పత్తి 8%, అమ్మకాలు 10% చొప్పున తగ్గాయి. 

కొనొచ్చు
ఇటీవల గరిష్ట స్థాయికి చేరిన అల్యుమినా ధరలు తగ్గడం, అమ్మకాలు తగ్గడంతో స్థిర వ్యయాల ప్రభావం అధికంగానే  ఉండటం నాల్కో పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపించింది.  అమ్మకాలు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి. అయితే చైనా నుంచి సరఫరాలు పెరుగుతుండటంతో అల్యుమినా ధరలు మరింత తగ్గొచ్చు. రెండేళ్లలో ఎబిటా రూ.1,600 కోట్లకు, నికర లాభం రూ.1,000 కోట్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. గతంలో ఇచ్చిన అంచనాల కంటే వీటిని 20–30% తగ్గిచాం. అల్యూమినా ధరలు తక్కువగా ఉండటంతో ఇలా అంచనాలను తగ్గిస్తున్నాం. అయినప్పటికీ, కొనచ్చు రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. ఏడాదిలో ఈ షేర్‌ రూ.69ను చేరుతుందని భావిస్తున్నాం.  ధరలు పెరిగితే ఈ రంగంలో అత్యధికంగా లాభపడే కంపెనీ ఇదే కానున్నది.

రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్స్‌
ప్రస్తుత ధర:     రూ.325       
టార్గెట్‌ ధర:     రూ.498 

ఎందుకంటే: భారత ప్రభుత్వానికి చెందిన రిపాట్రియేట్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (రెప్‌కో)బ్యాంక్‌ ప్రమోట్‌ చేస్తున్న రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాల కంటే బలహీనంగా ఉన్నాయి. ఆదాయం అంతంతమాత్రంగానే ఉండటం, కేటాయింపులు అధికంగా ఉండటంతో రూ.56 కోట్ల నికర లాభాన్ని మాత్రమే సాధించగలిగింది. రుణాల మంజూరు సీక్వెన్షియల్‌గా చూస్తే 6 శాతం తగ్గి రూ.7,300 కోట్లకు పరిమితమైంది. దీంతో నిర్వహణ ఆస్తులు 12 శాతం మాత్రమే పెరిగాయి. సీజనల్‌ ట్రెండ్‌కు అనుగుణంగానే స్థూల మొండి బకాయిలు పెరిగాయి. ఈ క్యూ2లో 3.6 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 3.9 శాతానికి పెరిగాయి. అధిక విలువ ఉన్న రుణాలను మంజూరు చేయడాన్ని నిలిపేసిన ఈ కంపెనీ రికవరీలపై దృష్టి పెట్టింది. ఈ చర్యల ఫలితాలు, ఫలాలు రానున్న క్వార్టర్లలో కనిపిస్తాయి.   ఈ కంపెనీ లోన్‌బుక్‌లో 60 శాతానికి పైగా తమిళనాడు నుంచే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో భూమి రిజిస్ట్రేషన్‌ సమస్య కారణంగా రుణ రికవరీలు మందగమనంగా ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర మార్కెట్‌ 25 శాతం, గుజరాత్‌ మార్కెట్‌ 45 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. సాధారణంగా వేతన ఉద్యోగులకే పలు గృహ రుణ సంస్థలు రుణాలిస్తాయి. కానీ ఈ కంపెనీ స్వయం ఉపాధి వ్యక్తులకు కూడా రుణాలిస్తోంది. ప్రస్తుత నిధుల లభ్యత సమస్య, గృహ రుణాల రంగంలో రికవరీ మందకొడిగా ఉండటం వంటి ప్రతికూలతలు రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌పై సమీప భవిష్యత్తులో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఫలితంగా వృద్ధి, నికర వడ్డీ మార్జిన్‌పై ఒత్తిడి కొనసాగవచ్చు. అయినప్పటికీ, ఈ షేర్‌ను విక్రయించకుండా, అట్టేపెట్టుకోవాలని రికమెండ్‌ చేస్తున్నాం. లోన్‌ క్యాంప్స్‌ ద్వారా విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించడం, మార్కెటింగ్‌ దళారీ వ్యవస్థ లేకపోవడం సానుకూలాంశాలు. 

మరిన్ని వార్తలు