టాటా పవర్‌ లాభం రూ.612 కోట్లు 

15 Feb, 2018 02:12 IST|Sakshi
టాటా పవర్‌ కంపెనీ

ఆదాయం 6 శాతం అప్‌ 

న్యూఢిల్లీ: టాటా పవర్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.612 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సాధించిన నికర లాభం, రూ.619 కోట్లతో పోల్చితే 1 శాతం తగ్గిందని టాటా పవర్‌ తెలిపింది. ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.7,096 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ అనిల్‌ సార్దానా  పేర్కొన్నారు. పునరుత్పాదన విద్యుదుత్పత్తి విభాగం లాభం రూ.14 కోట్ల నుంచి రూ.72 కోట్లకు పెరిగిందని వివరించారు.

అన్ని అనుబంధ విభాగాలతో కలుపుకొని ఈ క్యూ3లో మొత్తం 12,402 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని తెలిపారు. అంతేకాకుండా తమ మొత్తం విద్యుదుత్పత్తికి 227 మెగావాట్ల సౌర విద్యుత్తు, 5.4 మెగావాట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తి జత అయ్యాయని వివరించారు. పునరుత్పాదన విద్యుదుత్పత్తి  వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టాటా పవర్‌ షేర్‌ 0.2 శాతం లాభపడి రూ.87 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు