టాటా స్టీల్‌ లాభం రూ. 1,018 కోట్లు

31 Oct, 2017 00:56 IST|Sakshi

క్యూ2లో ఆదాయం 20 శాతం అప్‌

ముంబై: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,018 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నష్టం రూ.49 కోట్లు. రెండో త్రైమాసికంలో ఆదాయం 20 శాతం వృద్ధి చెంది రూ. 27,120 కోట్ల నుంచి రూ. 32,464 కోట్లకు పెరిగింది. క్యూ2లో ఉక్కు ఉత్పత్తి సైతం 5.94 మిలియన్‌ టన్నుల (ఎంటీ) నుంచి 6.24 ఎంటీకి పెరిగింది.

దేశీయంగా కార్యకలాపాల విషయానికొస్తే.. డెలివరీలు పెరిగి, రాబడులు మెరుగుపడటంతో 33 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షాకాలంలో నిర్మాణ కార్యకలాపాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండు, వినియోగదారుల సెంటిమెంటు బలహీనంగా ఉన్నప్పటికీ.. విక్రయాలపరంగా మెరుగైన పనితీరే కనపర్చగలిగామని టాటా స్టీల్‌ ఎండీ టీవీ నరేంద్రన్‌ చెప్పారు. కొంగొత్త వాహన మోడల్స్‌ రాకతో పాటు కొత్త గ్రేడ్‌ను అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో తమ ఆటోమోటివ్‌ విభాగం 34% వృద్ధి నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

27 కొత్త ఉత్పత్తులు..
సమీక్షాకాలంలో వివిధ కస్టమర్ల విభాగాల్లో 27 కొత్త ఉత్పత్తులు రూపొందించినట్లు నరేంద్రన్‌ వివరించారు. మరోవైపు దక్షిణాసియా వ్యాపార కార్యకలాపాలు సైతం నిర్వహణపరంగా పటిష్టమైన పనితీరు కనపర్చాయని ఆయన చెప్పారు.

వివిధ మార్కెట్లలో అమ్మకాలు పెరగడంతో సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన గ్రూప్‌ ఆదాయాలు 9 శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కౌశిక్‌ చటర్జీ వివరించారు. అయితే,  సీజనల్‌ అంశాలతో యూరోపియన్‌ కార్యకలాపాలు బలహీనంగా ఉండటంతో సీక్వెన్షియల్‌గా స్థూలలాభం కొంత క్షీణించిందన్నారు. అటు నిర్వహణ మూలధన అవసరాలు, ఫారెక్స్‌ ప్రభావాలతో స్థూల రుణభారం రూ. 2,450 కోట్ల మేర పెరిగిందని చటర్జీ పేర్కొన్నారు. కంపెనీ వద్ద నగదు, తత్సమాన నిల్వలు రూ. 19,800 కోట్ల మేర ఉన్నాయి. 

మరిన్ని వార్తలు