ఎందుకీ వృథా చర్చ! | Sakshi
Sakshi News home page

ఎందుకీ వృథా చర్చ!

Published Tue, Oct 31 2017 12:54 AM

use less discussion on Kashmir autonomy - Sakshi

ఎంతో లోతుగా చర్చించి, అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవా ల్సిన ప్రధానాంశాలన్నీ మన దేశంలో ఎన్నికల సీజన్‌లో ప్రస్తావనకొస్తాయి. అసలు విషయాన్ని వదిలి భావోద్వేగాల చుట్టూ పరిభ్రమిస్తాయి. ఎన్నికలు పూర్తికాగానే అటకెక్కుతాయి. మరో ఎన్నికల సంరంభం వరకూ వాటిని ప్రస్తావించే వారూ ఉండరు... పరిష్కరించేవారూ ఉండరు. కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి అంశం ఇప్పుడ లాంటి భావోద్వేగాల్లోనే చిక్కుకుంది. పర్యవసానంగా దాని అర్ధం, పరమార్ధం మారిపోయింది. కశ్మీర్‌లో అధిక సంఖ్యాకులు ఆ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి ఉండా లనుకుంటున్నారని, ‘ఆజాదీ’(స్వాతంత్య్రం) అంటే వారి దృష్టిలో స్వయంప్రతిపత్తే  నని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన ప్రకట నతో ఈ తేనెతుట్టె కదిలింది.

ఆదివారం బెంగళూరులో ఒక సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ‘నిన్నటిదాకా అధికారంలో ఉన్నవారు ఇవాళ కశ్మీర్‌ స్వాతం త్య్రాన్ని కోరేవారితో స్వరం కలిపార’నడమే కాదు... మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న జవాన్లను కాంగ్రెస్‌ అవమానపరిచిందని వ్యాఖ్యానించారు. నవం బర్‌ 9,14 తేదీల్లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవి రెండూ సరిహద్దు రాష్ట్రాలు. చిదంబరం ప్రకటన ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఏం కొంప ముంచుతుందోనని కాంగ్రెస్‌ వణికిపోయింది. అందుకే నరేంద్రమోదీ వేలెత్తిచూపక ముందే రంగంలోకి దిగింది. ‘నష్ట నివారణ’ చర్యలు మొదలెట్టింది. ఆయన అభి ప్రాయాలతో పార్టీకి ఏకీభావం లేదంటూ వివరణనిచ్చుకుంది.

నిజానికి ‘స్వయంప్రతిపత్తి’ అన్నది అంత ప్రమాదకరమైన మాటే అయితే... దేశానికి హాని కలిగించేదైతే మన రాజ్యాంగ నిర్మాతలు దాని జోలికి పోయేవారు కాదు. రాజ్యాంగంలో చేర్చి ఉండేవారే కాదు. జమ్మూ–కశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి వీలు కల్పిస్తున్న 370వ అధికరణ రాజ్యాంగంలో చేరడానికి చారిత్రక కారణాలు న్నాయి. కశ్మీర్‌ ప్రాంతాన్ని దాని పాలకుడు హరిసింగ్‌ 1947 అక్టోబర్‌లో భారత్‌లో విలీనం చేసినప్పుడు ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా ఆ అధి కరణ వచ్చింది. దాని ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు మినహా మిగిలిన అంశాల్లో కేంద్ర శాసనాధికారాలకు జమ్మూ–కశ్మీర్‌లో పరిమితులుం టాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో దేన్నయినా తాత్కాలికంగా వర్తింజేసినా, రాష్ట్ర రాజ్యాంగసభ పరిశీలించి ధ్రువీకరించాకే పూర్తి స్థాయిలో అమలవుతుంది. రాష్ట్రా నికి ఏ ఏ అంశాల్లో అధికారాలుండాలో రాజ్యాంగసభ నిర్ణయిస్తుంది. అలాగే రాజ్యాంగంలోని ఏ అధికరణ అవసరమో కూడా అది నిర్ధారిస్తుంది. అలాగే 370వ అధికరణ ఉనికిలో ఉండటం అవసరమో, కాదో...ఉంచితే దానికి ఎలాంటి సవర ణలు అవసరమో ఆ సభ సిఫార్సు చేయాలి కూడా. కానీ 1951 అక్టోబర్‌లో ఏర్పా టైన రాష్ట్ర రాజ్యాంగ సభ 370వ అధికరణ సంగతి తేల్చకుండానే 1956లో రద్ద యింది. కనుకనే మొదట్లో తాత్కాలికమనుకున్న 370వ అధికరణ రాజ్యాంగంలో శాశ్వతంగా ఉండిపోయింది.

జమ్మూ–కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిస్తున్న ఈ అధికరణను రద్దు చేయాలని బీజేపీ, సంఘ్‌ పరివార్‌ సంస్థలు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. తమకు సొంతంగా మెజారిటీ లభిస్తే ఆ అధికరణను రద్దు చేస్తామని బీజేపీ ఎన్నడో చెప్పింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ విషయంలో తన అభిప్రాయాన్ని కొంత సవరించుకుంది. అధికరణ రద్దుపై సంబంధిత పక్షాలతో చర్చించి ఒప్పిస్తామని తెలిపింది. అయితే రెండేళ్లక్రితం జమ్మూ–కశ్మీర్‌లో పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కుదిరిన ఉమ్మడి ఎజెండా మాత్రం స్వతంత్ర ప్రతిపత్తి విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించింది. ఆ విషయంలో ఇప్పటికీ బీజేపీ వైఖరి మారలేదు. అలాంటపుడు స్వయంప్రతిపత్తి అంశం లేవనెత్తితే ఇంత హడా వుడి దేనికి? అటు కాంగ్రెస్‌దీ ఇదే తంతు. ఈ అంశాన్ని చర్చకు లాగిన చిదంబరం పదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో కీలక శాఖలు చూశారు. ఆ సమయంలోనూ జమ్మూ–కశ్మీర్‌లో ఆందోళనలు చెలరేగాయి. ఉద్రిక్త తలు ఏర్పడ్డాయి. కానీ అప్పట్లో చిదంబరానికి స్వయంప్రతిపత్తి అంశం గుర్తుకు రాలేదు. దాన్ని తమ ప్రభుత్వమే నీరుగారుస్తున్నదని ఆనాడు తెలియలేదు.

మన రాజ్యాంగం భారత రిపబ్లిక్‌ను ‘రాష్ట్రాల సమాఖ్య’గా గుర్తించింది. కేంద్రం అధికారాలేమిటో, రాష్ట్రాలకుండే అధికారాలేమిటో, ఇద్దరికీ ఉమ్మడిగా ఉండే అధికా రాలేమిటో నిర్దేశించే మూడు వేర్వేరు జాబితాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. రాష్ట్రాలు స్వశక్తితో ఎదగడానికి, అభివృద్ధి సాధించడానికి వాటికి కొన్ని అధికా రాలుండటం అవసరం. ప్రతిదీ న్యూఢిల్లీలో నిర్ణయించి అమలు చేయాలనుకుంటే ఇంత విశాలమైన దేశంలో కుదరని పని. అయితే దురదృష్టమేమంటే రాష్ట్రాల అధికారాలు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాయి. కాస్త హెచ్చుతగ్గులతో అవి మున్సిపాలిటీల స్థాయికి దిగజారాయి. ఉన్న వనరులేమిటో... సాధించవలసిన లక్ష్యాలేమిటో... తీర్చవలసిన అవసరాలేమిటో... అమలు చేయాల్సిన పథకాలే మిటో నిర్ణయించుకుని అభివృద్ధిలో దూసుకుపోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి దానికీ కేంద్రంవైపు చూడాల్సివస్తోంది. నిధుల కొరతతో సతమతం కావాల్సి వస్తోంది.

ఈమధ్యే అమల్లోకొచ్చిన జీఎస్‌టీ విషయంలో రాష్ట్రాల అభ్యంతరం ప్రధానంగా అదే. ఆదాయం గణనీయంగా పడిపోయిందని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు గగ్గోలు పెడుతున్నారు. 370వ అధికరణ ద్వారా జమ్మూ–కశ్మీర్‌కు సమ కూడిన స్వయంప్రతిపత్తిలోని లొసుగులేమిటో, దానివల్ల దేశానికి కలుగుతున్న నష్ట మేమిటో వివరించడానికి పూనుకుంటే వినడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. అప్పుడు ఆ అధికరణను సమర్ధించేవారు తమ వాదనను వినిపిస్తారు. రాష్ట్రాలకు అసలు ఉంటున్న, ఉండాల్సిన అధికారాలపైనా చర్చ జరుగుతుంది. అందుకు పార్ల మెంటు, రాష్ట్రాల్లోని చట్టసభలతోపాటు అనేక వేదికలున్నాయి. కానీ ఎన్నికలు ముంచుకొచ్చినప్పుడు మాత్రమే వాటిని ప్రస్తావిస్తూ, ప్రజల్లో భావోద్వేగాలు పెంచి ఆనక మౌనంగా ఉండిపోవడం వల్ల ప్రయోజనమేమిటి? నాయకులు ఆలోచించాలి.

Advertisement
Advertisement