రక్షణాత్మక వాణిజ్యానికి దూరం

16 Jul, 2014 02:57 IST|Sakshi
రక్షణాత్మక వాణిజ్యానికి దూరం

ఫోర్టలేజా (బ్రెజిల్): వాణిజ్యంలో రక్షణాత్మక చర్యలకు దూరంగా ఉంటామని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ఆఫ్రికా) దేశాలు ఉద్ఘాటించాయి. పెట్టుబడులు, వ్యాపారం వృద్ధికి విధానపరంగా మరింత సమన్వయంతో వ్యవహరిస్తామని తెలిపాయి. బ్రిక్స్ ఆరో సదస్సు సందర్భంగా ఆయా దేశాలు మంగళవారం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

 భారత ప్రధాని మోడీతో పాటు బ్రెజిల్ వెళ్లిన వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిక్స్ దేశాల వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. బ్రిక్స్ దేశాల నడుమ ప్రస్తుతం 23 వేల కోట్ల డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని వచ్చే ఏడాదికి 50 వేల కోట్ల డాలర్లకు పెంచవచ్చని ఈ సందర్భంగా మంత్రులు అభిప్రాయపడ్డారు.

 బ్రిక్స్ బ్యాంకులో సమాన వాటాలు..
 5 వేల కోట్ల డాలర్లతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంకులో ఐదు సభ్య దేశాలకూ సమాన వాటాలుంటాయి. ఈ బ్యాంకు ఏర్పాటుకు ఇండియా గట్టిగా ఒత్తిడి తెస్తోంది. బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంకులో ఒక్కో సభ్య దేశానికి వెయ్యి కోట్ల డాలర్ల వాటా ఉండాలని అవగాహన కుదిరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సమాన వాటాలుంటే ఏ ఒక్క దేశమో ఆధిపత్యం చెలాయించడం కుదరదని పేర్కొన్నాయి.

 బ్రిక్స్ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని  ఢిల్లీలో నెలకొల్పాలని భారత్ పట్టుబడుతుండగా, దాన్ని షాంఘైలో ఏర్పాటు చేస్తారని సూచనలు వెలువడుతున్నాయి. ఈ బ్యాంకుకు ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు’ అనే పేరు పెట్టాలన్న మోడీ సూచనను ఆమోదించే అవకాశం ఉంది. చెల్లిం పుల సమతౌల్యంలో సమస్యలు ఉత్పన్నమైనపుడు బ్రిక్స్ దేశాలకు అందుబాటులో ఉండడానికి 5 వేల కోట్ల డాలర్లతో అత్యవసర సహాయ నిధి(సీఆర్‌ఏ)ని ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు