ఆస్తులకు ఎసరు : మారిన మాల్యా స్వరం

28 Aug, 2018 09:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలాది కోట్లు ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా భారత్‌కు తిరిగివచ్చేందుకు సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు. భారత్‌లో రూ 13,500 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను ఈడీ సీజ్‌ చేయడంతో ఇవి తన చేతులు దాటి పోకుండా చూసుకునేందుకే దేశానికి తిరిగివచ్చేందుకు ఆయన మొగ్గుచూపుతున్నారు.

లండన్‌లో తలదాచుకున్న మాల్యాను తమకు అప్పగించాలంటూ భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించిన లిక్కర్‌ కింగ్‌ తాజాగా తన ఆస్తులు ప్రభుత్వపరమవుతాయనే ఆందోళనతో దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని, భారత్‌ తిరిగివచ్చేందుకు సిద్ధమేననే సంకేతాలు పంపుతున్నారని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. తొలుత భారత జైళ్లలో సౌకర్యాలు ఉండవని, తగినంత గాలి, వెలుతురు ఉండదని బ్రిటన్‌ కోర్టులో వాదించారు. ఇటీవల చేపట్టిన పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీన చట్టం మాల్యాలో వణుకుపుట్టిస్తోంది.

ఈ  చట్టం ప్రకారం దర్యాప్తు సంస్థలు సీజ్‌ చేసిన ఆస్తులు ప్రభుత్వ పరమవుతాయి. ఈ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు పంచుతుందని, ఒక్కసారి ప్రభుత్వ పరమైన ఆస్తులను తిరిగి విడిపించే అవకాశం ఉండదని ఆర్థిక మంత్రి‍త్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు సీజ్‌ చేసిన తన ఆస్తులను కాపాడుకునేందుకే మాల్యా భారత్‌ తిరిగివస్తానని అదే పనిగా సంకేతాలు పంపుతున్నారని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు