క్యాష్‌బ్యాక్‌ మోసం @ 10 కోట్లు

15 May, 2019 09:01 IST|Sakshi

పేటీఎం చీఫ్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ..  వాట్సాప్‌పై యూటర్న్‌

ముంబై: ఉద్యోగులు, వ్యాపారులు కలిసి కుమ్మక్కై చేసిన క్యాష్‌బ్యాక్‌ మోసం పరిమాణం దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందని తమ అంతర్గత విచారణలో తేలినట్లు చెల్లింపుల సేవల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు. ఈ మోసం బైటపడిన నేపథ్యంలో వందల కొద్దీ విక్రేతలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించడంతో పాటు పలువురు ఉద్యోగులను తప్పించినట్లు వివరించారు. ‘దీపావళి తర్వాత కొంత మంది విక్రేతలకు పెద్ద ఎత్తున క్యాష్‌బ్యాక్‌ లభిస్తుండటాన్ని మా టీమ్‌ గుర్తించింది. దీన్ని మరింత లోతుగా పరిశీలించాలని మా ఆడిటర్లను కోరాం‘ అని విజయ్‌ శేఖర్‌ శర్మ చెప్పారు. ఆడిటింగ్‌ సంస్థ ఈవై నిర్వహించిన ఆడిట్‌లో కొందరు జూనియర్‌ స్థాయి ఉద్యోగులు, సంస్థలు కుమ్మక్కై ఈ క్యాష్‌బ్యాక్‌ కుంభకోణానికి తెరతీసినట్లు వెల్లడైందని ఆయన వివరించారు. మరోవైపు, ఇప్పటిదాకా పేమెంట్స్‌ వ్యవస్థలోకి మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ రాకను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్‌ శేఖర్‌ శర్మ తాజాగా స్వరం మార్చారు. వాట్సాప్‌ లాంటి సంస్థల రాక స్వాగతించదగ్గ పరిణామమేనన్నారు. భారతీయ చట్టాలను పాటించడానికి సిద్ధంగా లేని సంస్థలను మాత్రమే తాను వ్యతిరేకించానని ఆయన చెప్పారు. 

క్యాష్‌బ్యాక్‌లిచ్చినా ఫర్వాలేదు ..
క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో వ్యాపారం లాభసాటిగా ఉండదన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఇలాంటివి ఇచ్చినా వ్యాపారం నిలదొక్కుకోగలదని శర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరింత మంది యూజర్లు, వ్యాపారులకు చేరువయ్యేందుకు భారీగా వ్యయాలు చేస్తున్నందున లాభాల్లోకి మళ్లేందుకు మరికాస్త సమయం పట్టవచ్చన్నారు. యూజర్ల సంఖ్య 30 నుంచి 50 కోట్ల దాకా, వ్యాపార సంస్థల సంఖ్య ప్రస్తుతమున్న 1.2 కోట్ల నుంచి 4 కోట్లకు పెరిగేదాకా లాభాలు నమోదు కాకపోవచ్చని విజయ్‌ శేఖర్‌ శర్మ పేర్కొన్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
పేటీఎంలో క్యాష్‌బ్యాక్‌ స్కాం

మరిన్ని వార్తలు