వొడాఫోన్‌ ఐడియా నష్టం 5,005 కోట్లు

7 Feb, 2019 04:32 IST|Sakshi

రూ.11,983 కోట్లకు ఆదాయం

సీక్వెన్షియల్‌గా 52 శాతం వృద్ధి

4జీ కవరేజ్‌పై మరింత దృష్టి !

కంపెనీ సీఈఓ బాలేశ్‌ శర్మ వెల్లడి  

న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్‌– ఐడియాకు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.5,006 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. వడ్డీ వ్యయాలు అధికంగా ఉండటం, నెట్‌వర్క్‌ ఇంటిగ్రేషన్‌ వ్యయాలు కూడా ఎక్కువగా ఉండటం, మొబైల్‌ టవర్‌ వ్యాపారం నుంచి నిష్క్రమించిన వ్యయాలు కూడా అధికంగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఈ రెండు కంపెనీలకు కలసి రూ.1,285 కోట్ల నష్టాలొచ్చాయి. గత ఏడాది ఆగస్టు 31న ఐడియా, వొడాఫోన్‌ల విలీనం పూర్తయినందువల్ల ఫలితాలను పోల్చడానికి లేదు. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర నష్టాలు మరింతగా పెరిగాయి.

వడ్డీ వ్యయాలు రూ.2,824 కోట్లు...
ఈ క్యూ3లో మొత్తం ఆదాయం రూ.11,983 కోట్లకు పెరిగిందని వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. ఈ క్యూ2లో సాధించిన మొత్తం ఆదాయం రూ.7,879 కోట్లతో పోల్చితే 52 శాతం వృద్ధి సాధించామని కంపెనీ సీఈఓ బాలేశ్‌ శర్మ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.6,552 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. వడ్డీ వ్యయాలు రూ.2,824 కోట్లుగా ఉన్నాయని, మొబైల్‌ టవర్ల వ్యాపారం నుంచి బైటకు వచ్చామని, దీనికి గాను వెండర్లకు రూ.725 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు.

గతేడాది డిసెంబర్‌ 31 నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.1,23,660 కోట్లుగా ఉందని తెలిపారు. ఇండస్‌ టవర్స్‌లో 11.15 శాతం వాటాను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ వాటా విలువ రూ.4,960 కోట్లుగా ఉండొచ్చ న్నారు. అలాగే 1.58 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విక్రయించనున్నామని, ఈ విక్రయాల ద్వారా సమకూరిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని తెలిపారు.  

రూ.89కు ఏఆర్‌పీయూ..
ఈ క్యూ3లో ఎబిటా రూ.1,137 కోట్లుగా నమోదైందని, ఈ క్యూ2లో 6 శాతంగా ఉన్న మార్జిన్‌ ఈ క్యూ3లో 9.7 శాతానికి పెరిగిందని బాలేశ్‌ శర్మ పేర్కొన్నారు. ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) 1.5 శాతం పెరిగి రూ.89కు చేరిందని తెలిపారు. ఒక్కో వినియోగదారుడు వినియోగించే డేటా 5.6 జీబీనుంచి 6.2 జీబీకి పెరిగిందన్నారు. 75 కోట్ల మందికి 4జీ సర్వీసులందేలా 11,123 సైట్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

ఈ క్యూ3లో కొత్తగా 95 లక్షల 4జీ యూజర్లు జతయ్యారని, దీంతో మొత్తం 4జీ కస్టమర్ల సంఖ్య 7.53 కోట్లకు చేరిందని వివరించారు. 4జీ నెట్‌వర్క్‌ విస్తరణపై దృష్టి పెట్టామని బాలేశ్‌ శర్మ చెప్పారు.  అలాగే 4జీ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకోవాలనేది లక్ష్య మన్నారు. మూలధన సమీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని, ఈ ప్రణాళికకనుగుణంగా సమీకరించిన నిధులతో వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

తాజా ఏడాది కనిష్టానికి షేరు..
మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 1.6 శాతం నష్టపోయి రూ.29.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.28.80ను తాకింది.

మరిన్ని వార్తలు