సెన్సెక్స్‌ కీలకస్థాయి 36,470 

21 Jan, 2019 01:08 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

ఈ నెల తొలి రెండు వారాల్లో పరిమితశ్రేణిలో కదలిన ప్రపంచ ప్రధాన మార్కెట్లు...ముఖ్యంగా అమెరికా, యూరప్‌లు గతవారం బ్రేక్‌అవుట్‌ను సాధించి, ముందడుగు వేశాయి. ఇదేబాటలో భారత్‌ సూచీలు కొంత పెరిగినప్పటికీ, మూడు వారాల నిరోధాన్ని అధిగమించడంలో ఇబ్బంది పడుతున్నాయి.  అయితే ఇన్ఫోసిస్, ఐటీసీలకు తోడు ఇతర హెవీవెయిట్‌ షేర్లయిన టీసీఎస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు క్రితం వారం ర్యాలీ జరపడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే అంశం. మరో వారం రోజుల్లో వెల్లడికానున్న కేంద్ర బడ్జెట్లో...ప్రభుత్వ ద్రవ్యలోటును పెంచే ప్రతిపాదనలుంటాయన్న అంచనాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు వ్యవహరించే పెట్టుబడుల శైలికి అనుగుణంగా సమీప భవిష్యత్తులో మన మార్కెట్‌ కదలికలు వుండవచ్చు.  ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే,   

సెన్సెక్స్‌ సాంకేతికాలు... 
జనవరి 18తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌  తొలిరోజున 35,692 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత క్రమేపీ పెరిగి చివరి మూడురోజులూ 36,470 పాయింట్ల సమీపంలో అవరోధాన్ని చవిచూసింది. చివరకు అంతక్రితంవారంకంటే 377 పాయింట్లు లాభపడి 36,387 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం వరుసగా మూడురోజులపాటు నిరోధాన్ని కల్పించిన 36,470 పాయింట్ల స్థాయి ఈ వారం కీలకమైనది. ఈ స్థాయిపైన సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమై, స్థిరపడితే తొలుత 36,560 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. అటుపై ముగిస్తే 36,800–37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు.  ఈ వారం పైన ప్రస్తావించిన తొలి నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్‌ నిస్తేజంగా ప్రారంభమైనా 36,200 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 35,950 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ లోపున తిరిగి 35,690 పాయింట్ల స్థాయికి పరీక్షించవచ్చు.   

నిఫ్టీ కీలకస్థాయి 10,930 
గతవారం తొలుత 10,692 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వారంలో చివరి మూడు రోజులూ 10,930 పాయింట్ల సమీపంలో నిరోధాన్ని ఎదుర్కొని, ముందుకు సాగలేకపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 112 పాయింట్ల లాభంతో 10,907 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 10,930 పాయింట్ల స్థాయి కీలకమైనది. ఈ స్థాయిపైన మార్కెట్‌ బుల్లిష్‌గానూ, ఈ స్థాయిలోపున బేరిష్‌గానూ ట్రేడ్‌కావొచ్చు. అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో ఈ సోమవారం 10,930పైన నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలై, నిలదొక్కుకుంటే 10,985 స్థాయి వరకూ పెరిగే అవకాశం వుంది. ఈ మూడువారాల గరిష్టస్థాయిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుంది. అటుపై 11,020–11,110 పాయింట్ల శ్రేణివరకూ పెరగవచ్చు.  ఈ వారం పైన సూచించిన కీలకస్థాయిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,850 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిలోపున ముగిస్తే  10,775 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున క్రమేపీ తిరిగి 10,690 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు.  
– పి. సత్యప్రసాద్‌  

మరిన్ని వార్తలు