డెలివరీ స్పెషల్... ‘జిప్.ఇన్’

19 Mar, 2016 00:26 IST|Sakshi
డెలివరీ స్పెషల్... ‘జిప్.ఇన్’

అదేరోజు డెలివరీకి సొంత లాజిస్టిక్స్
ప్రస్తుతం హైదరాబాద్, విశాఖల్లో సేవలు
6 నెలలకో మెట్రోకు విస్తరణ.. బెంగళూరుతో షురూ
5 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టి
‘సాక్షి స్టార్టప్ డైరీ’తో జిప్.ఇన్ ఫౌండర్ కిశోర్ గంజి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరంభించి నిండా ఏడాదిన్నర కూడా కాలేదు. కానీ 30 వేల మంది కస్టమర్లకు చేరువయిందీ అన్‌లైన్ కంపెనీ. అంతేకాదు! నెలకు రూ.7 కోట్ల వ్యాపారాన్ని చేసే స్థాయికి చేరింది. హైదరాబాద్, విశాఖపట్నంలో సేవలందిస్తున్న ఈ కంపెనీ... త్వరలో బెంగళూరుకు... అక్కడి నుంచి ప్రతి ఆరునెలలకు మరో మెట్రో నగరానికి విస్తరించాలని లక్షిస్తోంది. ఈ స్థాయికి చేరుకున్న జిప్.ఇన్ ప్రస్థానం... ఈ వారం ‘స్టార్టప్ డైరీ’లో...

హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న జిప్.ఇన్  ప్రత్యేకత ఏంటంటే... ఆర్డర్ చేసిన రోజే సరుకులు డెలివరీ చేస్తుంది. ఉదయం ఆర్డర్ చేసినవారికి మధ్యాహ్నం ఒంటిగంటకల్లా సరువులు వచ్చి వాలిపోతాయి. ఇందుకోసం సంస్థ ప్రత్యేక లాజిస్టిక్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. అమెరికాలో ‘ఆస్టిర్’ పేరిట ఐటీ కంపెనీని ఏర్పాటు చేసిన కిశోర్ గంజి... 2014 డిసెంబర్లో ‘జిప్.ఇన్’ను ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా పనిచేస్తున్న ఆస్టిర్... ప్రస్తుతం 40 మిలియన్ డాలర్ల టర్నోవర్‌కు చేరుకుంది. హైదరాబాద్ ఏంజిల్స్ బోర్డ్ మెంబర్లలో కూడా కిశోర్ ఒకరు. ఇప్పటివరకు సుమారు 30 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ‘జిప్.ఇన్’ ప్రారంభం, విస్తరణ ప్రణాళిక గురించి మరిన్ని వివరాలు కిశోర్ మాటల్లోనే...

ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో వ్యాపారానికి కస్టమర్లను ఆకర్షించడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ లాజిస్టిక్సే ప్రధాన సమస్య. ఎందుకంటే ఇచ్చిన ఆర్డర్‌ను సమయానికి డెలివరీ చేయాలి. అలా చేయకుంటే ఎంత మంచి కస్టమరైనా మరోసారి రాడు. అదే గడువులోగా డెలివరీ చేస్తే... కస్టమర్‌తో పాటు బ్రాండ్ విలువ కూడా పెరుగుతుంది. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే... ఎక్కడైతే సమస్యలుంటాయో అక్కడే వ్యాపార అవకా శాలూ పుష్కలంగా ఉంటాయని! ఇదే జస్ట్.ఇన్ ప్రారంభానికి కారణమైంది. దేశంలో గ్రాసరీ విభాగంలో ఉన్న లాజిస్టిక్ సమస్యలను క్షుణ్నంగా తెలుసుకున్నాం. అందుకే ముందుగా వ్యవస్థీకృతమైన లాజిస్టిక్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మరో కో-ఫౌండర్ వెంకట్‌తో కలిసి కోటి రూపాయల పెట్టుబడులతో 14 నాలుగు చక్రాల వాహనాలను లీజుకు తీసుకొని జిప్.ఇన్‌ను ప్రారంభించాం.

నెలకు మిలియన్ డాలర్లు..: ప్రస్తుతం మాకు 30 వేల మంది కస్టమర్లున్నారు. ఇందులో 60-70% మంది రిపీటెడ్ కస్టమర్లే. నెలకు 5-6 వేల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకుంటున్నారు. నెలకు మిలియన్ డాలర్ల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. డెలివరీకి కనీస ఆర్డర్ విలువ హైదరాబాద్‌లో అయితే రూ.500, విశాఖలో అయితే రూ.249గా నిర్ణయించాం. ప్రస్తుతం మా సంస్థలో 80 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

 ఆరు నెలలకో మెట్రోకు..
ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నంలో సేవలందిస్తున్నాం. త్వరలోనే బెంగళూరుకు విస్తరిస్తాం. ఇక నుంచి ప్రతి ఆరు నెలలకు ఓ మెట్రో నగరంలో విస్తరించాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం 5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరిస్తున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.

8,500 ఉత్పత్తులు..
ప్రస్తుతం జిప్.ఇన్‌లో పండ్లు, కూరగాయలు, వంట సామగ్రి, కాస్మొటిక్స్, పూజా సామగ్రి, పెట్ కేర్, మాంసం... ఇలా సుమారు 15 విభాగాల్లో 8,500 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.5 నుంచి రూ.5వేల వరకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఉత్పత్తుల సంఖ్యను 12 వేలకు పెంచుతాం. ఇందుకోసం రిటైలర్లు, హోల్‌సేలర్స్, రైతులు.. ఇలా పలువురితో ఒప్పందాలు చేసుకున్నాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.com కు మెయిల్ చేయండి...

మరిన్ని వార్తలు