కశ్మీర్‌లో 18 గంటల ఎన్‌కౌంటర్‌

10 Dec, 2018 04:48 IST|Sakshi
ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బాష్ప గోళాలు ప్రయోగిస్తున్న పోలీసులు

ముగ్గురు ఉగ్రవాదులు మృతి, ఒక జవానుకు గాయాలు

మరో ఘటనలో వాంటెడ్‌ ఉగ్రవాది పట్టివేత

శ్రీనగర్‌: శ్రీనగర్‌ శివారులో దాదాపు 18 గంటలపాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు చనిపోగా ఒక జవానుకు గాయాలయ్యాయి. మరో ఘటనలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్‌ శివార్లలోని బందిపొరా రోడ్డు ముజ్‌గుంద్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు, భద్రతా బలగాలు శనివారం రాత్రి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు ప్రారంభించారు.

రెండు వర్గాల మధ్య దాదాపు 18 గంటలపాటు హోరాహోరీగా కాల్పులు కొనసాగాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు బలగాలు సుమారు ఐదు ఇళ్లను పేల్చి వేశారు. ఈ కాల్పుల్లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా ఒక జవానుతోపాటు ముగ్గురు పౌరులు గాయపడ్డారు. మృతులను బందిపొరా జిల్లా హజిన్‌ ప్రాంతానికి చెందిన ముదసిర్‌ రషీద్‌ పర్రే(16), సకీబ్‌బిలాల్‌ షేక్‌గా గుర్తించారు. అయితే, పర్రే వయస్సుతోపాటు, అతడు ఉగ్రవాదో కాదో నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

మూడో వ్యక్తిని పాక్‌కు చెందిన అలీగా అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం ఈ ప్రాంతంలో భద్రతా బలగాలతో స్థానికులు ఘర్షణలకు దిగటంతో పెల్లెట్లు, బాష్పవాయువును ప్రయోగించి వారిని చెదరగొట్టారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.  మరోఘటనలో..యువతను ఉగ్రవాద ముసుగులోకి లాగుతున్న కిష్త్వార్‌ జిల్లా సౌందర్‌ దచ్చాన్‌ గ్రామానికి చెందిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ గ్రూపు ఉగ్రవాది రియాజ్‌ అహ్మద్‌ను బలగాలు అరెస్టు చేశాయి.

ఇతడు కరడుగట్టిన ఉగ్రవాది మొహమ్మద్‌ అమిన్‌ అలియాస్‌ జహంగీర్‌కు సన్నిహితుడని పోలీసులు తెలిపారు. ఏకే–47 చేత పట్టుకుని ఉన్న రియాజ్‌ అహ్మద్‌ ఫొటోలు ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.  పరింపొరా ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనతో ఇతనికి సంబంధమున్నట్లు గుర్తించారు. యువతను ఉగ్ర ఉచ్చులోకి లాగడంలో రియాజ్‌ నిపుణుడని అధికారులు తెలిపారు.  హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన జహంగీర్‌ కిష్త్వార్‌ ప్రాంతంలో చాలాకాలంగా తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు