రోడ్డు కనబడక చెరువులోకి దూసుకెళ్లి.. 

26 Dec, 2023 02:11 IST|Sakshi

నీట మునిగిన కారు.. ఒకరు మృతి 

ఘటన సమయంలో కారులో ఐదుగురు 

ఈదుకుంటూ బయటపడిన నలుగురు 

11 గంటల గాలింపు తర్వాత ఒకరి మృతదేహం లభ్యం 

మృతుడు ఏపీలోని అనకాపల్లి జిల్లాకు చెందిన గుణశేఖర్‌గా గుర్తింపు 

అనంతగిరి: సరదాగా విహారయాత్ర కోసం బయలుదేరిన వారిని పొగమంచు కమ్మేసింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచుతో రోడ్డు సరిగా కనబడక.. కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఐదుగురిలో నలుగురు ఈదుకుంటూ బయటికిరాగా.. ఒకరు నీట మునిగి మృతి చెందారు. వికారాబాద్‌ పట్టణ శివార్లలోని శివారెడ్డిపేట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి బయటపడినవారు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

అనంతగిరి వెళదామని బయలుదేరి.. 
ఏపీలోని అనకాపల్లి జిల్లా దేవరాంపల్లి మండలం మామిడిపల్లికి చెందిన గుణశేఖర్‌ (24), వైజాగ్‌కు చెందిన సాగర్, రఘుపతి, చిత్తూరు జిల్లాకు చెందిన పూజిత, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోహన్‌ ఐదుగురూ స్నేహితులు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు.

సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి అనంతగిరి గుట్టలకు విహారయాత్ర కోసం బయలుదేరారు. వికారాబాద్‌ పట్టణ శివార్లలోని శివారెడ్డిపేట్‌ చెరువు వద్ద ప్రయాణిస్తున్న సమయంలో పొగ మంచు దట్టంగా అలుముకుని ఉంది. దీనితో రోడ్డు సరిగా కనిపించక కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.

ఈత వచ్చిన రఘు నీట మునిగిపోతున్న సాగర్‌ను బయటికి తీసుకువచ్చాడు. కారు నడుపుతున్న మోహన్, పూజిత కూడా సురక్షితంగా బయటికి రాగలిగారు. గుణశేఖర్‌ నీటిలో మునిగిపోయాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులను వికారాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రేన్‌ సాయంతో కారును బయటికి తీశారు. కారు చెరువులో పడిన సమయంలో తమను కాపాడాలని కేకలు వేసినా.. ఒడ్డున ఉన్న కొందరు సెల్‌ఫోన్లలో వీడియో తీసుకుంటూనే నిలబడ్డారని బాధితులు పేర్కొన్నారు. 

సుదీర్ఘ గాలింపు తర్వాత.. 
గజ ఈతగాళ్లతో గుణశేఖర్‌ కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదం విషయం తెలిసిన అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి ఘటనా స్థలికి చేరకుని సహాయక చర్యలను వేగిరం చేయాలని సూచించారు. సుమారు 11 గంటలపాటు గాలించిన తర్వాత సోమవారం సాయంత్రం గుణశేఖర్‌ మృతదేహం లభ్యమైంది.

>
మరిన్ని వార్తలు