నాలుగో బుల్లెట్.. అంతా ఉత్తదే...

8 Jan, 2018 13:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ హత్య కేసు పునర్విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు అమికస్‌ క్యూరీ (కోర్టు సహాయకుడు)గా సీనియర్‌ అడ్వొకేట్‌ అమరేందర్‌ శరణ్‌ నియమించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో సుదీర్ఘ పరిశీలన చేపట్టిన ఆయన సోమవారం తన నివేదికను సుప్రీం కోర్టుకు అందజేశారు. 

మహాత్మాగాంధీని గాడ్సేనే హతమార్చాడని.. ఇందులో విదేశీ నిఘా సంస్థల వ్యక్తుల ప్రమేయం లేదని అమికస్‌ క్యూరీ స్పష్టం చేశారు. కేసును పునర్విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్‌ అర్కైవ్స్‌ నుంచి అవసరమైన పత్రాలు, నివేదిక క్షణ్ణంగా పరిశీలించాకే ఈ నివేదికను రూపొందించినట్లు అమరేందర్‌ వెల్లడించారు. నాలుగో బుల్లెట్‌ గాంధీ ప్రాణం తీసిందన్న అంశం ఉత్తదేనని ఆయన తేల్చేశారు. 

కాగా, గాంధీ హత్య కేసులో పలు అనుమానాలు ఉన్నాయని.. దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని కోరుతూ ముంబైకి చెందిన పరిశోధకుడు, అభినవ్‌ భారత్‌ సంస్థ ట్రస్టీ పంకజ్‌ ఫడ్నవీస్‌ సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. అయితే ఈ వాదనను గాంధీ మునిమనుమడు తుషార్‌ గాంధీ ఖండించారు. ఈ కేసులో జోక్యం చేసుకొనే హక్కు పంకజ్‌కు లేదంటూ తుషార్‌ తరఫు న్యాయవాది కోర్టులో విన్నవించారు. మరి ఆ హక్కు తుషార్‌కు ఉందా? అని ప్రశ్నించిన బెంచ్‌.. ఈ కేసులో తమకూ చాలా అనుమానాలున్నాయని, శరణ్‌ నివేదిక అందేవరకూ తుది నిర్ణయం తీసుకోలేమని  వ్యాఖ్యానించింది కూడా.

మరిన్ని వార్తలు