దోచుకుంటూ.. దొరికిపోయాడు..

25 Apr, 2019 09:05 IST|Sakshi
నిందితుడు బాలశ్రీనివాసరావు

పని చేస్తున్న సంస్థకే టోకరా

ఉన్నతోద్యోగి అరెస్ట్‌

బంజారాహిల్స్‌: నెలకు రూ.6.50 లక్షల జీతం.. ఏసీ గదిలో విధులు.. అయినా ఆ అధికారి మాత్రం జల్సాలకు అలవాటు పడి అత్యాశతో పని చేస్తున్న సంస్థకే టోకరా వేశాడు. అందినకాడికి దండుకుంటూ ఎట్టకేలకు దొరికిపోయాడు. తీరా చూస్తే రూ.5 కోట్లు గోల్‌మాల్‌ జరిగినట్లు సంస్థ గుర్తించింది. నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. హైటెక్‌ సిటీ రోడ్‌లో కొత్తగూడ మీనాక్షి స్కై లాంజ్‌లో ఉంటున్న నంబూరి బాలశ్రీనివాసరావు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–12లోని ఎన్‌ఎస్‌ఎల్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ సంస్థలో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2019 ఏప్రిల్‌ 12 వరకు పనిచేశాడు. సంస్థకు సంబందించిన ఆర్థిక వ్యవహారాలను అతనే పర్యవేక్షించేవాడు.

సీఎఫ్‌వోగా పని చేస్తున్న అతడికి కంపెనీ ఏడాదికి రూ.80 లక్షల వేతనంతో పాటు సకల సౌకర్యాలు కల్పించింది. అయితే.. ఇటీవల ఐప్లస్‌ ఫైనాన్స్‌ అండ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా సంస్థను మోసం చేసి రూ.65 లక్షలు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో యాజమాన్యం అతడిపై నిఘా ఏర్పాటు చేయడంతో అక్రమంగా డబ్బులు దండుకుంటున్నట్లు  ఫిర్యాదులు అందాయి. దాదాపు రూ.5 కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడని అదే సంస్థలో పనిచేస్తున్న మధుబాబు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పక్కా ఆధారాలతో బెంగళూరులో తలదాచుకున్న నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రిమాండ్‌కు తరలించారు. విచారణలో నిందితుడు కొత్తగూడతో పాటు వెస్ట్‌ మారేడ్‌పల్లిలో మోసం చేసి సంపాదించిన డబ్బులతో ప్లాట్లు కొనుగోలు చేశాడని ఇటీవల రూ.80 లక్షలతో బీఎండబ్ల్యూ కారును కూడా కొనుగోలు చేసినట్లు తేలింది. బీఎండబ్ల్యూ కారును సైతం పోలీసులు సీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు