రూ. 18 వేల బండికి రూ. 96 వేలు చెల్లింపు!

8 May, 2020 10:38 IST|Sakshi

మార్కెట్‌ ప్లేస్‌లో చూసి మోసపోయిన బాధితుడు

సాక్షి, సిటీబ్యూరో: ఫేస్‌బుక్‌లోని మార్కెట్‌ ప్లేస్‌లో చూసిన సెకండ్‌ హ్యాండ్‌ ద్విచక్ర వాహనాన్ని రూ. 18 వేలకు కొనాలని భావించిన నగరవాసి సైబర్‌ నేరగాళ్ల చేతిలో రూ. 96 వేలు నష్టపోయాడు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ చిరువ్యాపారి సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ కొనాలని భావించాడు. దీనికోసం మార్కెట్‌ ప్లేస్‌లో సెర్చ్‌ చేసిన ఆయనకు ఓ వాహనం నచ్చింది. అందులో ఉన్న నంబర్‌కు సంప్రదించడంతో అవతలి వ్యక్తి ఆర్మీ ఉద్యోగిగా మాట్లాడాడు. బేరసారాల తర్వాత వాహనాన్ని రూ. 18 వేలకు అమ్మడానికి అంగీకరించాడు.

ఆర్మీ నిబంధనల ప్రకారం వాహనాన్ని కేవలం ఆర్మీ ట్రాన్స్‌పోర్ట్‌లోనే పంపాలని చెప్పిన అతగాడు... దాని చార్జీల కింద రూ. 3100 తొలుత చెల్లించాలని చెప్పాడు. తన గూగుల్‌ పే నంబర్‌ ఇచ్చి అందులో డిపాజిట్‌ చేయించుకున్నాడు. ఆ తర్వాత సైతం వివిధ కారణాలు చెప్తూ మొత్తం రూ. 96 వేలు కాజేశాడు. ప్రతి సందర్భంలోనూ వాహనంతో పాటు మిగిలిన మొత్తం రిఫండ్‌ వస్తాయని నేరగాళ్లు చెప్పడంతో బాధితుడు నమ్మాడు. నగదు ముట్టిన తర్వాత అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు