బిజినెస్‌ ఢ'మాల్స్‌' | Sakshi
Sakshi News home page

బిజినెస్‌ ఢ'మాల్స్‌'

Published Fri, May 8 2020 10:41 AM

Seasonal Business Loss With Lockdown in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ సీజనల్‌ బిజినెస్‌ను మింగేసింది. వ్యాపారుల అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. సీజన్‌ బిజినెస్‌ మొత్తం ఢమాలైంది. భవిష్యత్‌పై పెట్టుకున్న ఆశలు సైతం ఆవిరైపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్‌ వ్యాపారం బోల్తా పడింది. రూ.కోట్లాది ఆర్థిక లావాదేవిలన్నీ స్తంభించిపోయాయి. మార్చి, ఏప్రిల్, మే వరకు ఓ వైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు వేసవి, పండగ సీజన్‌ వస్తుండటంతో తలరాత మారిపోతుందనుకున్న వ్యాపారులు కరోనా ఎఫెక్ట్‌కు గురయ్యారు. నెల వ్యవధిలోనే వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. కరోనా విస్తరించడం, లాక్‌డౌన్‌ విధించడంతో కోలుకోని పరిస్థితికి చేరుకున్నారు. ఓవైపు నిర్వేదం, మరోవైపు కాలజ్ఞనం లాంటి వేదాంతం గురించి మాట్లాడుకుంటూ కాలం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

దెబ్బతిన్న వేసవి సీజన్‌..
కరోనా లాక్‌డౌన్‌ వేసవి సీజన్‌పై పూర్తిస్థాయిలో దెబ్బపడింది. వేసవి కాలాన్ని దష్టిలో ఉంచుకొని ఇక్కడి ఎలక్ట్రానిక్‌ వ్యాపారులు రూ.కోట్ల విలువైన ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు లాంటివి ఫిబ్రవరిలోనే కొనుగోలు చేసి సీజన్‌ కోసం గోదాంలలో భద్రపరుస్తారు. వీటన్నింటికీ జూన్‌ వరకు భారీగా గిరాకీలు ఉంటాయి. ఎలక్ట్రానిక్‌ పెద్ద వ్యాపార సంస్థలు పెద్దఎత్తున డిస్కౌంట్‌ ఆఫర్లు కూడా ఇస్తుంటాయి. మరి కొందరు కేవలం కూలర్‌ వ్యాపారంపై ఆధారపడి బిజినెస్‌ కొనసాగిçస్తుంటారు మరి కొందరికి ఉపాధి సైతం కల్పిస్తుంటారు. లాక్‌డౌన్‌తో వేసవి ప్రారంభంలోనే వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో ఆ వస్తు సామగ్రి అంతా గోదాముల్లోనే ఉండిపోయింది. అలాగే షోరూంలు, గోదాంల కిరాయిలతో పాటు అందులో పనిచేసే సిబ్బందికి వేతనాల చెల్లింపు సమస్యగా తయారైంది.

హలీమ్‌ వ్యాపారంపై కూడా..
కరోనా లాక్‌డౌన్‌తో రంజాన్‌ సీజన్‌లో హలీమ్‌ రుచిలేకుండా పోయింది. ఫలితంగా వ్యాపారస్తుల ఆశలు అడియాలయ్యాయి. రంజాన్‌ నెల వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో నోరూరించే హలీమ్‌ను ఆస్వాదించని మాంసాహారులు ఉండరు. హైదరాబాద్‌ బిర్యానీకి ఎంత పేరుందో.. ఇక్కడి హలీమ్‌కు అదేస్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ మహా నగరం మొత్తం మీద ప్రతి రంజాన్‌ మాసంలో సుమారు 12 వేలకు పైగా హలీమ్‌ బట్టిలు వెలుస్తాయి. కేవలం ఈ సీజన్‌పై ఆధారపడి హోటల్‌ వ్యాపారం సాగించే వాళ్లు సగానికి పైగా ఉంటారు. నగరం నుంచి దేశ, విదేశాలకు సైతం హలీమ్‌ ఎగుమతి అవుతోంది. మొత్తం మీద హైదరాబాద్‌లో వందకోట్ల వ్యాపారం హలీమ్‌ ద్వారా జరుగుతుంది. ఈ వ్యాపారంపై సుమారు 50 వేల కుటుంబాలు ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఆధారం ఉపాధి పొందుతుంటారు. ఈ సారి లాక్‌డౌన్‌తో హలీమ్‌ వంటకాలే లేకుండా పోయాయి.   

వస్త్ర వ్యాపారంపై..
లాక్‌డౌన్‌తో దుస్తుల వ్యాపారులపై బండ పడినట్లయ్యింది. ఒక వైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు రంజాన్‌ పండుగ సీజన్‌ దృష్టిలో పెట్టుకొని తెప్పించిన స్టాక్‌ గోదాముల్లో ములుగుతోంది. ముఖ్యంగా నగరంలో కేవలం ఈ రెండు సీజన్లలోనే వందల కోట్ల దుస్తుల వ్యాపారం సాగుతుంది. మరోవైపు ఈ దుస్తుల వ్యాపారంపై వేలాది మంది ఆధారపడి ఉపాధి పొందుతుంటారు. ఇప్పటికే పెళ్లిళ్ల మూహుర్తాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ఫంక్షన్‌ హాళ్లు సైతం మూతపడటంతో వీటిపై ఆధారపడ్డ వందల సంఖ్యలో లేబర్లు, పూలవ్యాపారులు, ఎలక్ట్రానిక్‌ వ్యాపారులు సైతం ఉపాధిని కోల్పోయారు. మరోవైపు రంజాన్‌ నెల ప్రారంభమైనా.. సీజన్‌ బిజినెస్‌ను లాక్‌డౌన్‌ వెంటాడుతూనే ఉంది. చిన్నా చితకా వ్యాపారానికి సైతం ఆస్కారం లేకుండా పోయింది. ఒక వేళ లాక్‌డౌన్‌ సడలించినా.. వైరస్‌ భయంతో షాపింగ్‌ చేసే పరిస్థితి కానరావడం లేదు. వ్యాపారం స్తంభించిపోవడంతో యజమానులు తల్లడిల్లిపోతున్నారు.  

కోలుకోవడం కష్టమే..
కరోనా ప్రభావంతో అన్నిరకాల దుకాణాలు, వ్యాపారాలు మూతపడటంతో వందల కోట్ల లావాదేవీలు పతనమైపోయాయి. దీంతో మహా నగరంలో వ్యాపార, వాణిజ్య రంగాలు మరో ఏడాది వరకు కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. చాలామంది వ్యాపారులు సీజన్‌ దందా కోసం బ్యాంకుల్లోనూ, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి పెద్దమొత్తంలో అప్పులు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం అప్పుల చెల్లింపు, సిబ్బందికి వేతనాల చెల్లింపుతో పాటు షోరూంలు, గోదాంల కిరాయిలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. 

Advertisement
Advertisement