స్విగ్గీ పేరుతో మహిళకు కుచ్చుటోపీ

11 Sep, 2019 08:52 IST|Sakshi

బెంగళూరు: స్విగ్గీ పికప్‌ డ్రాపింగ్‌ విధానంద్వారా తన ఫోన్‌ని అమ్మాలనుకొని చిన్నపొరపాటుతో 95 వేల రూపాయలను తన బ్యాంకు ఖాతాలోనుంచి పోగొట్టుకుంది బెంగుళూరుకి చెందిన అపర్ణ థక్కర్‌. బెంగుళూరులోని ఇందిరానగర్‌లో నివాసముంటోన్న అపర్ణాథక్కర్‌ సూరి ఓఎల్‌ఎక్స్‌ ద్వారా తన ఫోన్‌ని అమ్మకానికి పెట్టింది. మహ్మద్‌ బిలాల్‌ అనే వ్యక్తి అపర్ణకి ఫోన్‌ చేసి తాను ఆ ఫోన్‌ని కొంటానని చెప్పాడు. స్విగ్గీ గో యాప్‌ ద్వారా బిలాల్‌కి తన ఫోన్‌ని పంపింది. అయితే ఫోన్‌ బిలాల్‌కి చేరకపోగా ఆర్డర్‌ క్యాన్సిల్‌ అయినట్టు బిలాల్‌ అపర్ణకి సమాచారం ఇచ్చాడు.

స్విగ్గీ బాయ్‌ని అపర్ణా నిలదీయగా ఆర్డర్‌ క్యాన్సిల్‌ అయ్యిందనీ ఫోన్‌ తన ఆఫీసులో ఉందనీ సమాధానమిచ్చాడు. స్విగ్గీ నుంచి మాట్లాడిన వ్యక్తి వస్తువు ఎవరికి పంపాలో పూర్తి సమాచారం ఇవ్వలేదనీ, పొరపాటున ఆమె కొడుకు నంబర్‌ ఇవ్వడం వల్ల ఫోన్‌ డెలివరీ కాలేదనీ చెప్పాడు. గూగుల్‌లో ఉన్న స్విగ్గీ గో కస్టమర్‌ కేర్‌ కి ఫోన్‌ చేసిన అపర్ణ వాళ్లడిగిన బ్యాంకు ఖాతా నంబరు, యూపీఐ పిన్‌ నంబరు వంటి వివరాలన్నీ అందించింది. దీంతో ఆమె ఖాతా నుంచి సైబర్‌ నేరగాళ్ళు అవలీలగా 95 వేలు కాజేయగలిగారు. ఈ మొత్తం డెబిట్‌ అయినట్టు మెసేజ్‌ని అందుకున్న అపర్ణ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. స్విగ్గీ బ్రాండ్‌ నేమ్‌ ఉన్న కంపెనీ కనుకనే తాను ఆగంతుకులకు అన్ని వివరాలిచ్చానని అపర్ణ తెలిపారు.

మరిన్ని వార్తలు