దోపిడీ, చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు

23 Jan, 2019 14:04 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ రాఘవ, వెనక ముసుగులో ఉన్న నిందితులు

42 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.25 వేలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఏఎస్పీ రాఘవ

గుంటూరు:వ్యసనాలకు బానిసలుగా మారి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు, ఇంటి దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు యువకులను అర్బన్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్‌ ఏఎస్పీ ఎస్‌.రాఘవ వివరాలు వెల్లడించారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌కు చెందిన పెండ్ర ముత్తయ్య పందుల పెంపకం చేస్తూ జీవిస్తుంటాడు. పేకాట, కోడి పందేలు, మద్యానికి బానిసగా మారాడు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో శ్రీనివాసరావు పేటకు చెందిన స్నేహితుడు బండి శేషుతో కలసి దోపిడీలకు పాల్పడడం ప్రారంభించారు. రోడ్ల వెంట చిరు వ్యాపారాలు చేసుకునే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, వారికి మాయమాటలు చెప్పి వారిని నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి కొట్టి భయపెట్టి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు దోపిడీ చేసి పరారవుతుంటారు.

ఈ తరహాలో గత నెల 28 వ తేదీ నుంచి ఈనెల 21 వ తేదీ వరకు అర్బన్‌ జిల్లా పరిధిలోని ఆరు దోపిడీలు, ఓ ఇంటి దొంగతనానికి పాల్పడ్డారు. వరుసగా జరుగుతున్న దోపిడీలపై కేసులు నమోదవుతుండటంతో సీసీఎస్‌ పోలీసులు, అర్బన్‌ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు మంగళవారం మంగళగిరి ఫ్లైఓవర్‌ వద్ద ఉన్నట్టు సమాచారం అందడంతో చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, దోపిడీ,దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద ఉన్న 42 గ్రాముల బంగా>రు ఆభరణాలు, రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో ప్రతిభను కనపరిచిన అధికారులు, సిబ్బందికి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్స్‌ చేశారు. నిందితులపై సస్పెక్ట్‌ షీట్లు ప్రారంభించామని ఏఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐలు రవిబాబు, అబ్దుల్‌ కరీం, ఎస్‌ఐ భార్గవ్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు