హనీట్రాప్‌ ఆటకట్టు

3 Jan, 2019 10:16 IST|Sakshi
నిందితులను అరెస్ట్‌ చేసి చూపుతున్న పోలీసులు

యువతిని వలవేసి దోపిడీలు  

అమ్మాయి, నలుగురు యువకుల అరెస్టు   

హాసన్‌లో దొరికిపోయిన బెంగళూరు ముఠా

అమాయక యువకులతో తీయగా మాటలు కలపడం, ప్రేమ, దోమ పేరుతో షికార్లకు తీసుకెళ్లడం ఆమె పని. చివర్లో దుండగులు ఊడిపడి యువకులను కొట్టి దోచుకెళ్లడం. ఫేస్‌బుక్‌ ద్వారా కూడా యువకులకు వల వేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న హనీ ట్రాప్‌ ముఠా పాపం పండి కటకటాలు లెక్కిస్తోంది.

కర్ణాటక, బనశంకరి: ఫేస్‌బుక్‌ ద్వారా యువకులను పరిచ యం చేసుకుని హనీ ట్రాప్‌ ద్వారా దోపిడీకి పాల్ప డుతున్న కిలాడీ లేడీతో పాటు ఐదుగురిని బుధవారం హాసన్‌ జిల్లా అరసికెరె పోలీసులు అరెస్ట్‌ చేశారు. అర్పిత, పవన్, కిరణ్, దొరె, హమేశ్‌ అనే ఐదుగురు ముఠాగా ఏర్పడి అమాయకులకు అమ్మాయిని ఎరవేసి దోచుకునేవారు. వీరందరిదీ బెంగళూరే కావడం గమనార్హం. 

గుడికి వెళ్తున్న యువకుణ్ని లిఫ్ట్‌ అడిగి డిసెంబరు 22వ తేదీన దిలీప్‌ అనే యువకుడు జేనకల్‌ కొండలో పూజల కోసమని బైకుపై బయలుదేరాడు. ఈ సమయంలో కిలాడీ లేడీ అర్పిత, దిలీప్‌ను డ్రాప్‌ కావాలని అడిగింది. ఆమె బైక్‌ మీద కూర్చోగానే అరసికెరె వైపు నుంచి కారులో వచ్చిన నలుగురు దుండగులు, బైకును అడ్డుకున్నారు. యువకుణ్ని కొట్టి అతడి వద్ద  ఉన్న నగదు, ఏటీఎం కార్డు, మొబైల్‌ఫోన్‌ ఇతర వస్తువులను దోచుకుని ఉడాయించారు. 

ఫిర్యాదుతో కదిలిన డొంక  
దాడిలో గాయపడిన దిలీప్‌ను తల్లిదండ్రులు హాసన్‌ ప్రభుత్వాసుపత్రిలో చేర్చించి, గండసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్‌పీ.. అరసికెరె డీఎస్పీ సదానంద తిప్పణ్ణ నేతృత్వంలో మూడు ప్రత్యేక పోలీస్‌బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు పలుకోణాల్లో గాలింపుచర్యలు చేపట్టి బుధవారం అర్పితను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ చేపట్టగా ఆ దాడికి పాల్పడింది తమ ముఠానేనని అంగీకరించింది. ఆమె అందించిన సమాచారం ఆధారంగా బుధవారం సాయంత్రం మిగతా నలుగురినీ అరెస్ట్‌ చేశారు. 

ఫేస్‌బుక్‌ ద్వారా వల  
అర్పిత ఫేస్‌బుక్‌లో యువకులను ఎంచుకుని వారితో పరిచయం పెంచుకునేది. నిత్యం వారితో చాట్‌ చేసేది. డబ్బున్న యువకులతో కలసి విందులు, షికార్లకువెళ్లేది. తీసుకెళ్లి తిరుగుప్రయాణంలో బెంగళూరుకు వచ్చే సమయంలో తన గ్యాంగ్‌ కు సమాచారం అందించి వారితో యువకుల ను బెదిరించి కొట్టి నగదు, బంగారు ఆభరణాలు దోచుకుని ఉడాయిస్తున్నట్లు పోలీసు ల విచారణలో వెలుగుచూసింది. హనీ ట్రాప్‌ ద్వారా యువకులను వలలోకి పడేస్తున్న నేరాలపై అర్పితతో పాటు గ్యాంగ్‌పై అరసికెరె, నోణవినకెరె పోలీస్‌స్టేషన్లులో గతంలో రెండుకేసులు నమోదై ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే రచ్చ అవుతుందనే భయంలో పలువురు బాధితులు మిన్నకుండిపోయారు.  

మరిన్ని వార్తలు