మాయచేసి.. మాటల్లో దింపి..

29 Mar, 2019 13:01 IST|Sakshi
నిందితుడి అరెస్ట్‌ చూపుతున్న సీసీఎస్‌ పోలీసులు

సాక్షి, కరీంనగర్‌క్రైం: కరీంనగర్, వరంగల్, జనగామా జిల్లాల్లో అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి.. మోసం చేస్తున్న సికింద్రాబాద్‌ చిలకలగూడకు చెందిన కొవ్వూరి రాజేశ్వర్‌రావు(45) ఊరాఫ్‌ కిరణ్‌రెడ్డి, సురేష్, రాజును కరీంనగర్‌ సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చూపారు. ఏసీపీ శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. కొవ్వూరి రాజేశ్వర్‌రావు హన్మకొండలోని అమరావతినగర్‌లో నివాసముంటున్నాడు. అమాయకులను మోసం చేయడమే వృత్తిగా ఎంచుకున్నాడు. ప్రధాన పట్టణాల్లోని ఆస్పత్రుల వద్ద మకాం వేసి అక్కడికి వచ్చే అమయకులకు, వృద్ధులకు సాయం చేస్తున్నట్లు నటించి వారివద్దనున్న బంగారం చోరీ చేస్తుంటాడు.

రైల్వేస్టేషన్లు, ఆలయాల వద్ద మకాంవేసి తను దోషాల నివారణకు మార్గం చెప్తానని నమ్మిస్తాడు. తమవద్ద ఉన్న బంగారు ఆభరణాలు ఇమ్మని, వాటికి పూజలు చేస్తానని, ఈ లోపు కాళ్లుకడుక్కుని రమ్మని అక్కడినుంచి పరారవుతాడు. ఇంకా పలురకాల విద్యలు వచ్చని మోసం చేస్తున్నాడు. చోరీచేసిన బంగారు ఆభరణాలను ముణప్పురం, మూత్తుట్‌ వంటి ఫైనాన్స్‌ కంపెనీల్లో తాకట్టుపెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. ఇలా ఆరు నేరాలకు సంబంధించిన ఆభరణాలను హుజూరాబాద్‌లోని మణప్పురంలో, మూడు నేరాలకు సంబంధించిన ఆభరణాలను హన్మకొండ నయిమ్‌నగర్‌లో మణçప్పురంలో, మరోనేరానికి సంబంధించిన వాటిని నయిమ్‌నగర్‌ మూత్తుట్‌ మినీలో తాకట్టు పెట్టాడు.

ఈ క్రమంలో పలువురు బాధితులు కరీంనగర్‌ సీపీ కమలాన్‌రెడ్డిని ఆశ్రయించారు. కేసును సీసీఎస్‌ పోలీసులకు అప్పగించారు. సీఐ కిరణ్, సైబర్‌క్రైం ఇన్‌చార్జి మురళి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. పలు సీసీఫుటేసీలు పరిశీలించగా బాధితులు నిందితుడ్ని గుర్తించారు. సైబర్‌ ల్యాబ్‌ ద్వారా నిందితుడు రాజేశ్వర్‌రావుగా నిర్దారించుకున్నారు. గురువారం ఉదయం జమ్మికుంటలోని డాక్టర్‌స్ట్రీట్‌లో సంచరిస్తుండగా సీఐ కిరణ్, జమ్మికుంట సీఐ సృజన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అతడినుంచి రూ.4 లక్షల విలువైన 13 తులాల బంగారం, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీసీఎస్‌ సీఐ కిరణ్, జమ్మికుంట సీఐ సృజన్‌రెడ్డి, సైబర్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జి మురళి, సీసీఎస్‌ ఎస్సై కనుకయ్య, సిబ్బందిని సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించి రివార్డు అందించారు.   

మరిన్ని వార్తలు