మహాలక్ష్మి అత్యాచార ఘటన : ఉరి తీయాలని డిమాండ్‌

9 May, 2020 17:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : నగర‌లోని చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దళిత బాలిక మహాలక్ష్మిపై అత్యాచారానికి పాల్పడిన షకీల్‌ను కఠిన శిక్షించాలని ఆల్‌ ఇండియా దళిత హక్కుల ఫోరం (ఏఐడీఆర్‌ఎఫ్‌) జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన షకీల్‌ను తక్షణమే ఎన్‌కౌంటర్‌ చేయాలని అన్నారు. దళిత బాలికపై అత్యాచారాన్నితీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. గతంలో దిశపై అత్యాచారం చేసిన వాళ్ళను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని, మరి దళిత బాలికకు అన్యాయం చేసిన వారిని ఎందుకు ఎన్‌కౌంటర్ చేయలేదని ప్రశ్నించారు. (శిక్ష తప్పదు: సత్యవతి రాథోడ్‌)

శనివారం కందుల ఆనందరావు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించాల్సిన అవసరం లేదు. వారికి నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నిందితులను వెంటనే ఎన్‌కౌంటర్‌ చేసేలా ప్రభుత్వం మీద పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇటీవల న్యాయస్థానాలు దళిత గిరిజనులు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడంతో మాకు న్యాయస్థానాల మీద నమ్మకం కూడా రోజు రోజుకి సడలిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్షను వేయాలి’ అని డిమాండ్‌ చేశారు.


ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. బాధితురాలికి అండగా ఉంటామని స్పష్టం చేస్తూ.. తక్షణ పరిహారం అందించాలని కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు.  మరోవైపు  బాలికపై అత్యాచారానికి పాల్పడిన షకీల్‌కు కఠిన శిక్ష పడుతుందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇదివరకే స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు