వాళ్లు బానిసలు.. వారిద్దరి తలలు నరుకు అంటూ..

3 Feb, 2020 09:39 IST|Sakshi

ఐసిస్‌ సానూభూతిపరుడి కాల్చివేత!

లం‍డన్‌: ఆత్మాహుతి దాడికి పాల్పడతానంటూ దక్షిణ లండన్‌ వీధుల్లో కత్తితో ఇద్దరిని గాయపరిచిన సుదేశ్‌ అమ్మన్‌(20) అనే వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన సుదేశ్‌ రెండు రోజుల క్రితమే విడుదలయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం నకిలీ ఆత్మాహుతి దాడి జాకెట్‌ ధరించి.. బాటసారులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ మధ్య వయస్కుడు, 20 ఏళ్ల యువతి గాయపడ్డారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐసిస్‌) సానుభూతి పరుడిగా ఉన్న సుదేశ్‌ అమ్మన్‌ను 2018 డిసెంబరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ క్రమంలో విచారణ సందర్భంగా.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఫోన్‌లో జరిపిన సంభాషణలు, చాట్స్‌ ఆధారంగా అతడిని అదే ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా తాను త్వరలోనే ఆత్మాహుతి దాడికి పాల్పడి.. అమరుడిగా మిగిలిపోతానని స్నేహితులకు చెప్పడం సహా అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను.. ఆమె తల్లిదండ్రులను తల నరికి చంపేలా ప్రోత్సహించడం వంటి మెసేజ్‌లు, సిరియాలోని యాజాదీ మహిళలు ఐసిస్‌ బానిసలు అని.. వారిపై సామూహిక అత్యాచారం చేసేందుకు తాను ఓ బృందాన్ని తయారు చేస్తున్నా అంటూ సోదరుడికి పంపిన ఫొటోలు, లండన్‌లోని తన ఇంట్లో ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు గుర్తించారు. నేరం నిరూపితమైన క్రమంలో స్థానిక కోర్టు అతడికి శిక్ష విధించింది. 

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అతడు జైలు నుంచి విడదలయ్యాడు. అయితే పోలీసులు సుదేశ్‌పై నిఘా ఉంచి.. రెండు రోజులుగా అతడిని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆత్మాహుతి జాకెట్‌ ధరించి.. దక్షిణ లండన్‌లోని వీధుల్లో కత్తితో సంచరిస్తున్న సుదేశ్‌ను గుర్తించారు. అతడు కత్తితో దాడులకు తెగబడిన క్రమంలో కాల్పులు జరిపారు. కాగా అతడి శవాన్ని పరిశీలించగా.. అతడు వేసుకున్నది నకిలీ జాకెట్‌ అని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు