‘ఎలక్ట్రానిక్‌’ మోసం

9 Sep, 2019 11:31 IST|Sakshi
తస్లీమ్‌ సయీద్‌

వినియోగదారుల నుంచి రూ. 3కోట్లు వసూలు

బోర్డు తిప్పేసిన ఆన్‌లైన్‌ సంస్థ

సనత్‌నగర్‌: వివిధ రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇస్తామని వినియోగదారుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసిన ఆన్‌లైన్‌ సంస్థ నిర్వాహకులు చివరకు బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను నిలదీస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బేగంపేట ప్రకాష్‌ నగర్‌లోని అద్‌నాన్‌ ఛాంబర్స్‌లో ‘హిమోగల్‌ టెక్నాలజీ సంస్థ’ఈ ఏడాది జులై 29న ప్రారంభమైంది. దీనికి మహ్మద్‌ తస్లీమ్‌ సయీద్, ఆదిత్యలు యజమానులుగా ఉన్నారు. వీరు కాల్‌ సెంటర్‌ మార్కెటింగ్‌ పేరిట సుమారు 90 మంది ఉద్యోగులను నియమించుకున్నారు. ఉద్యోగంలో చేరే సమయంలో వీరికి కాల్‌ సెంటర్, ఈవెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ వంటి పనులు ఉంటాయని చెప్పారు. తీరా విధుల్లోకి చేరాక ప్రజలకు ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ వస్తువులను విక్రయించే పనిని అప్పగించారు.

మొదట్లో ఉద్యోగులకు వస్తువులపై 70 శాతం ఆఫర్‌ ప్రకటించి, దీని కోసం ‘వావ్‌ జీ యాప్స్‌’ పేరిట ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో కస్టమర్లు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల కోసం ఆర్డర్లు చేశారు. ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించగా, కొందరు సంస్థ కార్యాలయానికి వచ్చి నగదు చెల్లించి వస్తువులు బుక్‌ చేసుకున్నారు. నెల రోజుల్లోనే సుమారు 1,500 ఆర్డర్లు వచ్చాయి. వచ్చిన ఆర్డర్లలో 50 నుంచి 100 వరకు చిన్న చిన్న వస్తువులను అందజేశారు. ఆ తరువాత ఆర్డర్‌ చేసిన వస్తువులు పంపకుండా నిర్వాహకులు జారుకున్నారు.  దీంతో ఏం చేయాలో తెలియక హిమోగల్‌ టెక్నాలజీ సంస్థ ఉద్యోగులు ఆదివారం బేగంపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సంస్థ నిర్వాహకుడు తస్లీమ్‌ సయీద్‌ను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు ఆదిత్య పరారీలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు