స్నేహితులే చంపేశారు

15 Jun, 2018 14:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యువకుడి హత్య కేసులో నిందితుల అరెస్టు

మనస్పర్థలతోనే హత్యకు ప్రణాళిక

వివరాలు వెల్లడించిన ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఏసీపీ

ఆరిలోవ(విశాఖ తూర్పు) : ఆరిలోవలో నాలుగు రోజుల కిందట దాడి చేసి ఓ యువకుడిని హత్య చేసిన నలుగురు నిందితులు గురువారం పోలీసులకు చిక్కారు. వీరంతా స్నేహితులే. మృతుడు, మిగిలిన వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెల్‌ ఏసీపీ బి.మోహనరావు ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. 

జీవీఎంసీ ఒకటో వార్డు ఐదో సెక్టార్‌ ప్రాంతం జైభీంనగర్, దుర్గాబజార్, ప్రగతినగర్‌ కాలనీలకు చెందిన బూరాడ ప్రసన్నకుమార్‌(24), సవరవిల్లి వెంకటరమణ, కొయ్య సతీష్, పొట్నూరు శ్యామ్, గుబ్బల పవన్‌ కుమార్‌లు స్నేహితులు. ప్రసన్నకుమార్‌ డైట్‌లో శిక్షణ పొంది, ఇటీవల టెట్‌ రాశాడు. మిగిలిన నలుగురు దీనదయాళ్‌పురం వద్ద జీవీఎంసీ కుక్కలు పట్టే కేంద్రంలో తాత్కాలిక ఉద్యోగులు. ప్రసన్న బాక్సర్‌. ‘నాతో మీరు ఫైటింగ్‌కు రాగలరా’ అంటూ తరచూ స్నేహితులపై పంచ్‌లు విసిరేవాడు.

ఇటీవల వీరి నలుగురితో ప్రసన్నకు స్నేహం చెడింది. ఈ నేపథ్యంలో సవరవిల్లి వెంకటరమణ తండ్రి అప్పన్నను కొద్ది రోజుల కిందట ప్రసన్న తీవ్రంగా కొట్టాడు. వెంకటరమణతో తన తండ్రి జరిగిన విషయాన్ని చెప్పాడు. వెంకటరమణ మిగిలిన ముగ్గురు స్నేహితులకు ఈ విషయం తెలిపాడు.

వారంతా ప్రణాళిక వేసుకుని ఈ నెల 10న ఆరిలోవ ఆఖరి బస్టాప్‌ మద్యం షాపు వద్ద మద్యం సేవించి, ప్రగతినగర్‌లో ఓ ఖాళీ స్థలం వద్ద మాటువేశారు. వారిలో ఒకరు ఇంట్లో ఉన్న ప్రసన్నను పిలిచాడు. ఖాళీ స్థలానికి వెళ్లిన ప్రసన్నను నలుగురూ కలసి ఇంటి నిర్మాణం కోసం ఉన్న రాళ్లతో బాదారు.

ప్రసన్నను చంపాలనే ఆలోచనతోనే వీరంతా అతని తల, చేతులు, కాళ్లపై తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ప్రసన్న తల్లిదండ్రులు, అక్క బావలను కొట్టి పరారయ్యారు. గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న ప్రసన్నను తండ్రి చిన్నారావు(ఏఆర్‌ కానిస్టేబుల్‌), బంధువులు కలసి పినాకిల్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ చికిత్స పొందుతూ ప్రసన్న ఈ నెల 13 రాత్రి మృతి చెందాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు నలుగురూ గురువారం మధ్యాహ్నం ముడసర్లోవ దరి గోల్ఫ్‌ క్లబ్‌ పక్కన తుప్పల్లో పోలీసులకు పట్టుబడ్డారు. హత్యకు గురైన ప్రసన్న ఎస్టీ కులానికి చెందిన యువకుడు.

దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందగా కొయ్య సతీష్‌ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సతీష్‌పై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మిగిలిన ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మోహనరావు తెలిపారు. వీరిని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్‌ఐ పాపారావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు