దేశంలో కనీవినీ ఎరుగని నిరసన

22 Jan, 2018 09:43 IST|Sakshi

జైపూర్‌/అహ్మదాబాద్‌ : దేశ చరిత్రలోనే ఊహించని మలుపు. ఒక సినిమాకు వ్యతిరేకంగా ఏకంగా 2వేల మంది మహిళలు ఆత్మార్పణకు సిద్ధమైన అరుదైన ఘట్టం. ‘‘మా మాట కాదని సినిమాను ప్రదర్శిస్తే థియేటర్ల ముందు చితిపేర్చుకుని ఆ మంటల్లో దూకి చస్తాం..’’ అని రాజ్‌పుత్‌ మహిళలు శపథంపూనారు. మహిళలకు తోడు పురుషులు కూడా పెద్ద ఎత్తున నిరసనల్లో పాలుపంచుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో ‘పద్మావత్‌’ విడుదలకానున్న నేపథ్యంలో గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మరో ఐదు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుజరాత్‌ ప్రభుత్వం బస్సు సర్వీసులను రద్దు చేసింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆత్మాహుతికి పేర్లు నమోదు చేసుకున్న 2వేల మంది మహిళలు : రాజ్‌పుత్‌ కులానికి చెందిన రాణి పద్మావతిది గొప్ప చరిత్ర అని, సినిమాలతో ఆమె పరువును మంటగలుపుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆ కులానికి చెందిన మహిళలు నినదించారు. ఆదివారం రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘర్‌ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 3వేల మంది రాజ్‌పుత్‌ మహిళలు పాల్గొన్నారు. సినిమాను ప్రవర్శిస్తే తామంతా మంటల్లోకి దూకి ఆత్మార్పణ(జౌహార్‌) చేసుకుంటామని జిల్లా కలెక్టర్‌కు అల్టిమేటం ఇచ్చారు. జౌహార్‌కు సిద్ధమంటూ ఇప్పటికే 2వేల మంది మహిళలు తమ పేర్లను రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఆ జాబితాను కూడా కలెక్టర్‌కు అందించారు.

బస్సులు బంద్‌.. మంత్రి అనూహ్య వ్యఖ్యలు : గుజరాత్‌లో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న హెహసానా రీజియన్‌లో కొద్ది గంటలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనేఉన్నాయి. పలుచోట్ల గుజరాత్‌ ఆర్టీసీకి చెందిన బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. దీంతో సోమవారం నుంచి బస్సు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో పరిస్థితులపై మంత్రి భూపేంద్రసింహ్‌  మాట్లాడుతూ.. ‘ఇలాంటివి చాలా సహజం’ అని అన్నారు. సినిమా విడుదలను అడ్డుకోరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడంపైనే తాము దృష్టిపెట్టినట్లు చెప్పుకొచ్చారు.

25న దేశవ్యాప్త ఆందోళన : పద్మావత్‌ సినిమాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తోన్న కర్ణిసేన.. సినిమా విడుదలయ్యేరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ‘‘ఇప్పటికే థియేటర్‌ యాజామాన్యాలతో మాట్లాడాం. పద్మావతిని ప్రదర్శించొద్దన్న మా డిమాండ్‌కు చాలా మంది ఒప్పుకున్నారు. ఒకవేళ ఎవరైనా సినిమాను ప్రదర్శిస్తే జరగబోయే పరిణామాలకు వారిదే బాధ్యత. పద్మావతి విడుదలయ్యే జనవరి 25న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం’’ శ్రీరాజ్‌పుత్‌ కర్ణిసేన అధికార ప్రతినిధి విజేంద్ర సింగ్‌ మీడియాతో అన్నారు.

మరిన్ని వార్తలు