ఐడీబీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం

24 Mar, 2018 02:40 IST|Sakshi

చేపల పెంపకం పేరిట రుణాలు తీసుకున్న 22 మంది

బ్యాంకు అధికారులతో కుమ్మక్కై రుణాల ఎగవేత

రూ.445 కోట్ల మేర బ్యాంకునకు కుచ్చుటోపి

ఐడీబీఐ జీఎంతో పాటు 31 మందిపై సీబీఐ కేసు  

సాక్షి, హైదరాబాద్‌: చేపల పెంపకం.. వాటి సంబంధిత వ్యాపారం పేరిట వారంతా ఐడీబీఐ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల్లో రుణం తీసుకున్నారు. ఆ తర్వాత సదరు రుణం చెల్లించకుండా కొందరు బ్యాంకు అధికారులతో కుమ్మక్కయ్యారు. దీంతో వీరి రుణాలను నిరర్థక ఆస్తుల జాబితాలో చేర్చేశారు. ఈ మొత్తం ఇప్పుడు సుమారు రూ. 445 కోట్లకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఐడీబీఐ జీఎంతో పాటు 31 మందిపై కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఐడీబీఐ బషీర్‌బాగ్, హబ్సిగూడ, విశాఖలోని సిరిపురం బ్రాంచ్‌ల నుంచి 22 మంది చేపల పెంపకం, వాటి సంబంధిత వ్యాపారం పేరిట 2009 నుంచి 2012 వరకు రూ.192.98 కోట్ల రుణాలు తీసుకున్నారు.

వీటిని చెల్లించకుండా బ్యాంకు అధికారులతో కుమ్మక్కు కావడంతో వీరి రుణాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించారు. దీని వల్ల 2017 సెప్టెంబర్‌ వరకు రూ.445.32 కోట్లు అప్పుగా ఉన్నట్టు ఐడీబీఐ నిర్ధారించింది. అయితే బ్యాంకులో రుణం పొందేందుకు చూపించిన ఆస్తి పత్రాలు, చేపల పెంపకం చేస్తున్నట్టు చూపించిన భూములు అన్నీ నకిలీవేనని ఐడీబీఐ సీనియర్‌ రీజినల్‌ హెడ్, జనరల్‌ మేనేజర్‌ మంజునాథ్‌ గుర్తించారు. రుణాలు పొందిన వారితో బ్యాంకు అధికారులు కుమ్మక్కై నష్టాలను తెచ్చిపెట్టారని ఆరోపిస్తూ హైదరాబాద్‌ రేంజ్‌ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. కంపెనీల పేరిట రుణాలు తీసుకున్న వారు వాటిని సొంత ఖాతాల్లోకి మళ్లించి.. ఇతర ఖాతాలకు తరలించినట్టు సీబీఐ గుర్తించింది. ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన వారు రుణాలు పొంది తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్టు సీబీఐ గుర్తించింది. 

సీబీఐ కేసు వీరిపైనే..
ఐడీబీఐ జనరల్‌ మేనేజర్‌ బట్టు రామారావు(ప్రస్తుతం ఉద్యోగం నుంచి తొలగించారు), ఆర్‌.దామోదర్‌(సీజీఎం రిటైర్డ్‌), ఆదిలక్ష్మీ గ్రూపునకు చెందిన ముప్పిడి లక్ష్మణ్‌రావు, ఎస్‌ సుధాకర్‌ గ్రూపునకు చెందిన సుధాకర్, ఎన్‌వీ సుబ్బరాజు గ్రూపునకు చెందిన వెంకటసుబ్బరాజు, చంద్రకాంత్‌ గ్రూపునకు చెందిన తోరం చిన్న వెంకటేశ్వర్‌రావు, ఎన్‌ రామరాజు గ్రూపునకు చెందిన నడింపల్లి రామరాజు, కేఎస్‌వీ ప్రసాద్‌రాజు గ్రూపునకు చెందిన కేఎస్‌వీ ప్రసాద్‌రాజు, సునీల్‌ చౌదరి గ్రూపునకు చెందిన ఆంజనేయరాజు, పాతూరి సునీల్‌ చౌదరి, ఎయిర్‌టెల్‌ సోమరాజు గ్రూపునకు చెందిన పీవీ కృష్ణంరాజు, బెల్లాల గ్రూపునకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, చైతన్యరాజు గ్రూపునకు చెందిన కేవీవీ సత్యనారాయణరాజు, వికేస్‌కుమార్‌ అగర్వాల్‌ గ్రూపునకు చెందిన వికేష్‌కుమార్‌ అగర్వాల్, సురేంద్రవర్మ గ్రూపునకు చెందిన సురేంద్రవర్మ, హరిప్రియా గ్రూపునకు చెందిన తోరం వెంకటేశ్వర్‌రావు, మింటే గ్రూపునకు చెందిన రమావత్‌ బాలు, గుట్టకోటయ్య గ్రూపునకు చెందిన కోటయ్య, ఓక్‌ట్రీ గ్రూప్‌నకు చెందిన కడాలి వెంకటరమణ, సూరం రవీందర్‌ గ్రూపునకు చెందిన రవీందర్, రంగరాజు గ్రూపునకు చెందిన కలిదిండి రామరాజు, సాయివర్మ గ్రూపునకు చెందిన అల్లూరి సాయిబాబా, సూరం వెంకటేశ్వర్‌రెడ్డి, సాయిబాబా గ్రూపునకు చెందిన ఏవీవీఎస్‌ సాయిబాబాతో పాటు ఏడుగురు బ్యాంకు ప్యానల్‌ వాల్యూయర్స్‌పై కేసు నమోదు చేసినట్టు సీబీఐ పేర్కొంది. పీసీయాక్ట్‌ 1988 సెక్షన్‌ 13(2), రెడ్‌విత్‌ 13(1), (సీ)(డీ), భారత శిక్షా స్మృతి (ఐపీసీ) 120–బి, రెడ్‌విత్‌ 420, 409, 468, 471 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని సీబీఐ ఎస్పీ వివేక్‌దత్‌ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు