యువకుడిని చితకబాదిన ఎస్‌ఐ?

26 May, 2020 13:08 IST|Sakshi
స్టేషన్‌ వద్ద బాధిత కుటుంబసభ్యుల ఆందోళన

ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలన్న తల్లి    

నెల్లూరు(క్రైమ్‌): ఏమాత్రం సంబంధం లేని విషయంలో ఎస్‌ఐ తన కుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టాడని ఆరోపిస్తూ ఓ తల్లి సోమవారం వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌ ఎదుట విలపించింది. సదరు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులను కోరింది. బాధిత తల్లి, సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేదాయపాలెం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ నెల 21వ తేదీన తెలుపురంగు స్కూటీలో వెలుతున్న యువకుడు ఓ యువతి చున్నీ పట్టుకుని లాగాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో అనుమానంతో ఆదివారం రాత్రి గాంధీనగర్‌కు చెందిన పవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తనకు ఏమీ తెలియదనీ, ఎవరి చున్నీ లాగలేదని ఆ యువకుడు చెబుతున్నా పట్టించుకోకుండా ఎస్‌ఐ కొట్టడంతో అస్వస్థతకు గురయ్యాడు.

స్టేషన్‌ బయట ఉన్న కుటుంబసభ్యులను పిలిచిన పోలీసులు వెంటనే అతనిని తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు అతనిని చికిత్సనిమిత్తం జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేయించారు. ఎస్‌ఐ వ్యవహారశైలిని నిరసిస్తూ బాధిత తల్లి, కుటుంబసభ్యులు సోమవారం వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. తన కుమారుడు ఈ నెల 21వ తేదీన నెల్లూరు నగరంలోనే లేడని పనుల కోసం బయటకు వెళ్లాడని చెబుతున్నా పోలీసులు వినకుండా తీవ్రంగా కొట్టారని బాధిత తల్లి చంద్రకళ ఆరోపించింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి ఆ ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదే విషయాన్ని ఆమె స్థానిక వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ టి.వి.సుబ్బారావును సైతం కోరింది. 

మరిన్ని వార్తలు