కురుక్షేత్ర ‘నిర్భయ’ ఘటనలో కొత్త ట్విస్ట్‌

18 Jan, 2018 09:11 IST|Sakshi

సాక్షి, ఛండీగఢ్‌ : హరియాణాలో సంచలనం సృష్టించిన దళిత బాలిక హత్యాచార ఘటనలో ఊహించని మలుపు. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న గుల్షన్‌(18) శవమై కనిపించాడు. బాలిక మృతదేహం లభించిన కాలువలోనే 120 కిలో మీటర్ల దూరంలో బుధవారం సాయంత్రం కుళ్లిపోయిన స్థితిలో ఉన్న గుల్షన్‌ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో పోలీసులకు ఇప్పుడు కొత్త సమస్య ఎదురైంది.

కురుక్షేత్ర ఝంసా గ్రామానికి చెందిన గుల్షన్‌(18), బాలిక(15) ఈ నెల 9 నుంచి కనిపించకుండాపోయారు. తమ కూతురిని గుల్షన్‌ కిడ్నాప్‌ చేశాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. గుల్షన్‌ కుటుంబ సభ్యులు మాత్రం వారిద్దరు ప్రేమించుకున్నారని..ఇష్టపూర్వకంగానే వెళ్లిపోయారని చెప్పారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి గురించి వెతకటం ప్రారంభించారు. ఇదిలా ఉండగానే 4 రోజుల తర్వాత జింద్‌ జిల్లా బుద్ధ ఖేర్‌ గ్రామంలోని కాలువ ఒడ్డుకు బాలిక మృతదేహాం కొట్టుకువచ్చింది. ఇది గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటన వెలుగు చూసింది.

వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు విస్తూ పోయే విషయాలను వెల్లడించారు. అత్యంత పైశాచికంగా అత్యాచారం చేశారని.. ఈ క్రమంలో ఆమె అవయవాలను గాయపరిచినట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు గుల్షన్‌ పై అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఇంతలోనే అతని మృతదేహం కూడా లభ్యం కావటం గమనార్హం. ఈ కేసులో చిక్కుముడి విప్పేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గ్రామంలోని ఓ పాడు బడ్డ బంగ్లా సమీపంలో వారిద్దరినీ చూశామని కొందరు గ్రామస్థులు చెప్పటంతో సాక్ష్యాల కోసం అక్కడ తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని.. సాధ్యమైనంత త్వరలో కేసును కొలిక్కి తీసుకొస్తామని సిట్‌ అధికారులు చెబుతున్నారు.

కాగా, ఈ ఘటన వెలుగు చూసిన రెండు రోజుల వ్యవధిలోనే మరో రెండు మైనర్‌ అత్యాచార ఘటనలు చోటు చేసుకోవటం మహిళా, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య నెలకొన్న ఘర్షణలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేయించి దర్యాప్తునకు ఆదేశించింది. 

బాలిక బంధువులే చంపారు : గుల్షన్‌ తల్లి 

కాగా, వారిద్దరినీ బాలిక బంధువులే చంపి ఉంటారని గుల్షన్‌ తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చివరిసారిగా వారిద్దరూ కలుసుకున్న సమయంలో పెద్ద గొడవ జరిగిందని ఆమె చెబుతున్నారు. ‘‘మా ఇంటి సమయంలోనే బాలిక, గుల్షన్‌ను కలుసుకుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అమ్మాయి తరపు బంధువులు ఇద్దరిపై దాడి చేశారు. మేం బతిమిలాడటంతో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీస్‌ ఫిర్యాదు చేస్తే చంపుతామని బెదిరించారు’’ అని ఆమె చెబుతున్నారు. తన కొడుకులిద్దరినీ మూడు రోజుల క్రితం విచారణ పేరిట పోలీసులు తీసుకెళ్లారని.. వారిని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

రోదిస్తున్న గుల్షన్‌ తల్లి జైపాల్‌ సింగ్‌

మరిన్ని వార్తలు